వేగం కన్నా గమ్యం ముఖ్యం
భానుపురి (సూర్యాపేట) : వేగం కన్నా గమ్యం ముఖ్యమని, ఇదే విషయాన్ని ఆర్టీసీ పాటిస్తుందని ఆర్టీసీ నల్లగొండ డిప్యూటీ రీజినల్ మేనేజర్ సుచరిత పేర్కొన్నారు. గురువారం సూర్యాపేట డిపో ఆవరణలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం నల్లగొండ రీజియన్ లో 0.04శాతం యాక్సిడెంట్ రేట్ నమోదైందని, దీన్ని పూర్తిగా తగ్గించేందుకు డ్రైవర్లందరికీ ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్ పి. రవికుమార్, డిపో మేనేజర్ జి.లక్ష్మీనారాయణ, సూపర్ వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాకు మారోజు
వీరన్న పేరు పెట్టాలి
తుంగతుర్తి : తెలంగాణ రాష్ట్రం కావాలని మొట్టమొదట నినదించిన సీపీయూఎస్‌ఐ పార్టీ వ్యవస్థాపక కార్యదర్శి మారోజు వీరన్న పేరును సూర్యాపేట జిల్లాకు పెట్టాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దైద వెంకన్న డిమాండ్ చేశారు. గురువారం తుంగతుర్తి మండలం కొత్తగూడెంలో మారోజు వీరన్న జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ కుల వర్గ పోరాటాల సిద్ధాంతకర్త మారోజు వీరన్న అని పేర్కొన్నారు. ములుగు జిల్లా ను సమ్మక్క సారక్కగా ప్రకటించాలని, అలాగే మహబూబాబాద్‌కు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు టాను నాయక్ జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీయూఎస్‌ఐ నేతలు మట్టపల్లి లింగయ్య, మట్టపల్లి యాదయ్య ,వెంకట్ రాములు ,ఉపేందర్ , రాజేష్ పాల్గొన్నారు.
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో గురువారం సుప్రభాత సేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం జరిపించారు. శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామివారిని పట్టు వస్త్రాలంకరణతో అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేపట్టారు. అనంతరం విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణ తంతు ముగించారు.
వేగం కన్నా గమ్యం ముఖ్యం


