రిజర్వేషన్లు పాతవేనా?
5,6 తేదీల్లో రాజకీయ
పార్టీలతో సమావేశం
చైర్మన్ పదవికి గతంలో అమలు చేసిన రిజర్వేషన్లు
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ సందిగ్ధత
ఫ అధికారులు, ముఖ్యనేతల వద్ద
ఆరా తీస్తున్న ఆశావహులు
ఫ పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం
ఫ నేడు నోటీసు బోర్డుల్లో ముసాయిదా ఓటర్ల జాబితాల ప్రకటన
ఫ అభ్యంతరాలను స్వీకరించనున్న అధికారులు
ఫ 5, 6 తేదీల్లో మున్సిపల్,
జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల
నేతలతో సమావేశాలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ల మార్పుపై సందిగ్ధత నెలకొంది. పాత రిజర్వేషన్లనే కొనసాగిస్తారా లేక రిజర్వేషన్లను కొత్తగా మారుస్తారా అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఒకపక్క ఓటర్ల జాబితా తయారీకి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు పోలింగ్ బూతుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రకటించనున్నారు. వాటిపై అభ్యంతరాలను కూడా స్వీకరించి పదో తేదీన తుది ఓటర్ల జాబితా విడుదలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
రిజర్వేషన్ల అమలుపై సందిగ్ధం
స్థానిక సంస్థల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండు పర్యాయాలకు ఒకే రిజర్వేషన్ విధానం ఉండేలా నిబంధనలు తీసుకొచ్చింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దానిని పక్కన పెడుతోంది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ వంద శాతం ఎస్టీ గ్రామాలను మినహాయించి మిగితా వాటిల్లో రొటేషన్ పద్ధతిని అవలంబించింది. దీంతో బీసీ రిజర్వేషన్లు జనరల్‌కు, జనరల్ బీసీకి, ఎస్సీ స్థానాలు బీసీ, బీసీగా మారినవి చాలా ఉన్నాయి. అయితే అదే పద్ధతిని మున్సిపల్ ఎన్నికల్లో అవలంబిస్తుందా లేక 2020 ఎన్నికల సమయంలో అమలు చేసిన రిజర్వేషన్లనే కొనసాగిస్తుందా అనే దానిపై సందిగ్ధత నెలకొంది.
ఆశావహుల్లో ఆసక్తి
మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేయడం, ఎన్నికల కమిషన్ కూడా ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్ విడుదల చేయడంతో ఆశావహుల్లో ఆసక్తి మొదలైంది. సంవత్సర కాలంగా మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తున్న వారంతా ప్రస్తుతం పోటీ చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికారులు, ముఖ్య నేతల వద్ద రిజర్వేషన్లు మారుతాయా, లేక పాత వాటినే కొనసాగిస్తారా అనే దానిపై ఆశావహులు ఆరా తీస్తున్నారు.
వార్డుల వారీగా తేలిన ఓటర్ల లెక్క
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ వార్డుల్లో బుధవారం రాత్రి ఓటర్ల జాబితాను వార్డుల వారీగా ముసాయిదా జాబితా సిద్ధం చేశారు. వాటిని పునఃపరిశీలన చేస్తున్నారు. గురువారం ఉదయం జాబితాలను నోటీసు బోర్డులపై ఉంచనున్నారు.
అభ్యంతరాల స్వీకరణ
మున్సిపాలిటీల్లో గురువారం ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాపై జనవరి 4వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఆ జాబితాల్లో మార్పులు, చేర్పులపై ఓటర్ల నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. పేర్ల మార్పు, వార్డుల మార్పు తదితర అంశాలకు సంబంధించి కూడా అభ్యంతరాలను అధికారులు స్వీకరించి వాటన్నింటినీ సరిచేస్తారు.
ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన, అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఈ నెల 5వ తేదీన మున్సిపాలిటీల్లో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనున్నారు. జిల్లా స్థాయిలో 6వ తేదీన ఆయా పార్టీలతో సమావేశాలు నిర్వహించి వారు సూచనలు తీసుకుని అవసరమైతే మార్పులు, చేర్పులు చేపట్టనున్నారు. జనవరి 10న మున్సిపల్ తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు.
మున్సిపాలిటీ రిజర్వేషన్
నల్లగొండ ఓసీ జనరల్
చిట్యాల జనరల్
హాలియా జనరల్
దేవరకొండ జనరల్
చండూరు బీసీ మహిళ
నందికొండ జనరల్ మహిళ
మిర్యాలగూడ జనరల్
సూర్యాపేట జనరల్
హుజూర్‌నగర్ జనరల్ మహిళ
కోదాడ జనరల్ మహిళ
నేరేడుచర్ల ఎస్సీ జనరల్
తిరుమలగిరి ఎస్సీ మహిళ
భువనగిరి బీసీ జనరల్
ఆలేరు బీసీ జనరల్
భూదాన్‌పోచంపల్లి బీసీ మహిళ
చౌటుప్పల్ బీసీ జనరల్
మోత్కూరు జనరల్ మహిళ
యాదగిరిగుట్ట బీసీ మహిళ


