గుట్ట ఈఓ రాజీనామాపై సర్వత్రా చర్చ
అనారోగ్యం, వ్యక్తిగత కారణాలతోనేనని..
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓ వెంకట్రావ్ (రిటైర్డ్ ఐఏఎస్) తన విధులకు రాజీనామా చేయడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే రాజీనామా చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ప్రభుత్వం నూతన ఈఓగా ఎవరిని నియమిస్తుందనే చర్చ సైతం ఆలయ ఉద్యోగులు, స్థానిక ప్రజల్లో నెలకొంది.
ఏప్రిల్ 27న ఈఓగా నియామకం
యాదగిరీశుడి ఆలయానికి ఐఏఎస్ హోదాలో మొదటి ఈఓగా వెంకట్రావ్ గతేడాది ఏప్రిల్ 27న నియామకమై 30న బాధ్యతలు చేపట్టారు. గతేడాది ఆగస్టు 31న వెంకట్రావ్ పదవీ విరమణ పొందాల్సి ఉండగా.. ఒక్క రోజు ముందుగా ఆగస్టు 30న యాదగిరి ఆలయానికి ఈఓగా కొనసాగించడంతోపాటు అదనంగా శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్‌స్ అండ్ కల్చరల్ సొసైటీ ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆయన ఆలయ ఈఓగా అనేక కార్యక్రమాలు చేపట్టిన భక్తుల మన్ననలు పొందారు.
గరుడ ట్రస్టు.. ఉచిత ప్రసాద వితరణ
తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి చెందుతున్న యాదగిరీశుడి ఆలయంలో నూతన సేవలను తీసుకొస్తే బాగుంటుందని వెంకట్రావ్ భావించి, వైదిక కమిటీ సమీక్షలు నిర్వహించారు. ప్రధానంగా గరుడ ట్రస్టు, యాదగిరి మాస పత్రిక, ఈ ఆఫీస్, శ్రీసత్యనారాయణస్వామి వ్రతాల్లో పాల్గొనే భక్తులకు దేవుడి ప్రతిమ, చెల్లా, కనుమ, శ్రీస్వామిని దర్శించుకున్న భక్తులకు ఉచిత ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు ప్రారంభించారు. ధర్మ ప్రచారంలో భాగంగా ప్రచార రథానికి మరమ్మతులు చేయించి, గ్రామాల్లో శ్రీస్వామి వారి కల్యాణోత్సవాలు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ప్రసాద కౌంటర్లు, ఆలయ పరిసరాల్లో వద్ద క్రియోస్క్ మిషన్లు పెట్టించి, ఆన్‌లైన్ సేవలను విస్తరించారు.
ఫ ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు
వెల్లడించిన వెంకట్రావ్
ఫ రాజకీయ ఒత్తిళ్లే కారణమని భావిస్తున్న స్థానికులు
ఫ నూతన సంస్కరణలు, సమీక్షలతో భక్తులకు దగ్గరైన ఈఓ
యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓ వెంకట్రావ్ రాజీనామా చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాజీనామా పత్రాన్ని ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిపారు. వ్యక్తిగత కారణాలు, ఆరోగ్య సమస్యలతో రాజీనామా చేశానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తరువాత రాజీనామా చేసినట్లు వెల్లడించారు. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిపించామని, తిరుమల తరహాలో అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.


