మహిళా ఓటర్లే అధికం | - | Sakshi
Sakshi News home page

మహిళా ఓటర్లే అధికం

Jan 2 2026 12:34 PM | Updated on Jan 2 2026 12:34 PM

మహిళా ఓటర్లే అధికం

మహిళా ఓటర్లే అధికం

మహిళా ఓటర్లు 3.42 లక్షలు

అభ్యంతరాల స్వీకరణ 4వ తేదీ వరకు..

18 మున్సిపాలిటీల్లో తేలిన ఓటర్ల లెక్క

ఉమ్మడి జిల్లా పరిధిలోని 18 మున్సిపాలిటీల పరిధిలోని 6,65,585 మంది ఓటర్లుండగా అందులో మహిళలు 3,42,873 మంది ఉన్నారు. పురుషులు 3,22,617 మంది, ట్రాన్స్‌జెండర్లు 95 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికలు జరగబోయే 18 మున్సిపాలిటీల్లోనూ పురుషుల కంటే మహిళలే అధికంగా (20,256) ఉన్నారు. అందులోనూ నల్లగొండ మున్సిపాలిటీలో అత్యధికంగా పురుషుల కంటే మహిళా ఓటర్లు 4,806 మంది ఎక్కువగా ఉన్నారు. ఆ తరువాత సూర్యాపేట మున్సిపాలిటీలో పురుషుల కంటే ఎక్కువ మంది (4,473) మహిళలు ఉండటం గమనార్హం.

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో ఓటర్ల లెక్క తేలింది. ఎన్నికల సంఘం మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించేందుకు ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ షెడ్యూల్‌ ప్రకారం మున్సిపల్‌ కమిషనర్లు డిసెంబర్‌ 30 నుంచే కసరత్తు ప్రారంభించారు. వార్డుల వారీగా, పోలింగ్‌ కేంద్రాల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాలు రూపొందించి గురువారం ప్రకటించారు. కొన్ని మున్సిపాలిటీల్లో మాత్రం రాత్రి వరకు ఆయా జాబితాలను ప్రకటించారు. ఆయా మున్సిపాలిటీల్లో మొత్తంగా 6,65,585 మంది ఓటర్లు ఉన్నట్లు తేల్చారు.

మున్సిపాలిటీల్లో ఎన్నికలకు కసరత్తు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో నకిరేకల్‌ మున్సిపాలిటీకి గతంలో ఆలస్యంగా ఎన్నికలు జరగడంతో దాని పాలకవర్గం కాల పరిమితి ఇంకా పూర్తికాలేదు. దీంతో మిగతా 18 మున్సిపాలిటీలకే ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించనుంది. ఆయా మున్సిపాలిటీల్లో రూపొందించిన ముసాయిదా ఓటరు జాబితాలను మున్సిపల్‌ కమిషనర్లు ప్రకటించారు.

నాలుగేళ్లలో పెరిగింది తక్కువే..

2020 జనవరిలో నిర్వహించిన మున్సిపల్‌ ఎన్నికల కోసం 2019 చివరలో ఓటరు జాబితాలను సిద్ధం చేశారు. ప్రస్తుతం నిర్వహించబోయే ఎన్నికల కోసం 2023 అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన ఓటరు జాబితాల ఆధారంగా ప్రస్తుతం ముసాయిదా జాబితా రూపొందించారు. 2020లో ఉమ్మడి జిల్లాలోని నకిరేకల్‌ మినహా మిగితా 18 మున్సిపాలిటీల్లో 6,33,683 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం ఆ ఓటర్ల సంఖ్య 6,65,585కు పెరిగింది. అంటే 31,902 మంది ఓటర్లు పెరిగారు. పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది పెరిగారు. ఈ నాలుగేళ్లలో పురుష ఓటర్లు 13,107 పెరిగారు. మహిళా ఓటర్లు 18,722 మంది పెరిగారు. ట్రాన్స్‌జెండర్లు 73 మంది పెరిగారు.

ఫ పురుషుల కంటే 20,256 మంది మహిళలు ఎక్కువ

ఫ ముసాయిదా ఓటరు జాబితాల ప్రకటన

ఫ నాలుగేళ్లలో పెరిగింది 31,902 మంది ఓటర్లే..

ఫ ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో మొత్తం ఓటర్లు 6,65,585 మంది

ఫ 4వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ

మున్సిపాలిటీల వారీగా ముసాయిదా ఓటరు జాబితాల్లోని వివరాలు..

మున్సిపాలిటీ పురుషులు మహిళలు ట్రాన్స్‌జెండర్‌ మొత్తంఓటర్లు

నల్లగొండ 67,235 72,041 25 1,39,301

చిట్యాల 5,929 6,188 01 12,118

చండూరు 5,652 5,717 01 11,370

హాలియా 6,270 6,529 02 12,801

నందికొండ 6,441 7,079 01 13,521

దేవరకొండ 11,702 12,258 01 23,961

మిర్యాలగూడ 45,128 47,878 14 93,020

సూర్యాపేట 52,205 56,679 13 1,08,897

హుజూర్‌నగర్‌ 14,257 15,731 08 29,996

కోదాడ 28,560 30,031 10 58,601

నేరేడుచర్ల 6,629 7,116 01 13,746

పోచంపల్లి 7,808 8,031 – 15,839

చౌటుప్పల్‌ 13,553 13,663 – 27,216

తిరుమలగిరి 7,638 7,817 – 15,455

యాదగిరిగుట్ట 6,762 7,039 16 13,817

ఆలేరు 6,691 6,978 01 13,670

భువనగిరి 23,040 24,799 01 47,840

మోత్కూరు 7,117 7,299 – 14,416

మొత్తం 3,22,617 3,42,873 95 6,65,585

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముసాయిదా ఓటరు జాబితా రూపకల్పకనకు 2023 అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన ఓటరు జాబితాలనే ప్రామాణికంగా తీసుకున్నారు. వాటి ఆధారంగానే ఆయా మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా, పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓటరు జాబితాను తయారు చేసి వార్డుల వారీగా ప్రకటించారు. ఈ ముసాయిదా ఓటరు జాబితాలపై ఈ నెల 4వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. పేర్లు, వార్డుల మార్పు, పేర్లలో తప్పులు దొర్లినా కూడా వాటిని సరిచేసుకునేందుకు ఫిర్యాదులను స్వీకరించనున్నారు. వాటిని పరిశీలించి పరిష్కరించనున్నారు. ఆయా జాబితాలపై రాజకీయ పార్టీల నేతలతో 5వ తేదీన మున్సిపాలిటీ స్థాయిలో, 6వ తేదీన జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించనున్నారు. వారి నుంచి వచ్చే అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరిస్తారు. ఈనెల 10న మున్సిపాలిటీ వారీగా తుది ఓటరు జాబితా ప్రకటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement