పాఠశాలలకు క్రీడా నిధులు
ఫ తొలి విడతగా 606 స్కూళ్లకు రూ 68.10 లక్షలు మంజూరు
ఫ క్రీడా పరికరాల కొనుగోలుకు
మార్గం సుగమం
ఫ ఆటల్లో శిక్షణకూ తోడ్పాటు
హుజూర్‌నగర్ : విద్యార్థులు క్రీడల్లో రాణించేలా ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ నిధులతో ఆటల్లో శిక్షణతో పాటు క్రీడా సామగ్రి సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా 2025–26 విద్యా సంవత్సరానికి జిల్లాలోని 606 ప్రభుత్వ పాఠశాలలకు 50 శాతం క్రీడా నిధులు మంజూరు చేశారు.
606 పాఠశాలలకు..
జిల్లాలోని 606 పాఠశాలలకు తొలి విడతగా రూ 68.10 లక్షలు మంజూరు చేశారు. వీటిలో 369 ప్రాథమిక పాఠశాలలకు రూ 18.45 లక్షలు, 64 ప్రాథమి కోన్నత పాఠశాలలకు రూ 6.40 లక్షలు, 14 జెడ్పీ ఉన్నత పాఠశాలలకు రూ 39.25 లక్షలు, 16హయ్యర్ సెకండరీ (కేజీబీవీ, గురుకుల) స్కూళ్లకు రూ 4 లక్షల చొప్పున మంజూరు చేశారు.
నిధుల వినియోగం ఇలా..
ఈ ఏడాది తొలి విడతగా మంజూరు చేసిన ఈ నిధులను ప్రాథమిక పాఠశాలలకు రూ. 5 వేలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ. 10 వేలు, ఉన్నత పాఠశాలలు, హయ్యర్ సెకండరీ స్కూళ్లకు రూ. 25 వేల చొప్పున ఇస్తారు. ఈనిధులతో పాఠశాలల్లో క్రీడల్లో మెళకువలు నేర్పించడంతో పాటు క్రీడా సామగ్రి సమకూర్చ డానికి వినియోగించాలి. నిధులు అరకొరగా కేటాయించడంతో ఆట వస్తువులు ఎలా కొనుగోలు చేయాలా అని వ్యాయామ ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రారంభంలో కేటాయిస్తే మరింత ఉపయోగకరంగా ఉండేదని మరికొందరు అంటున్నారు.


