
కాటేపల్లిలో టైర్ల కంపెనీ తొలగించే వరకు పోరాటం
పంజగుట్ట: ప్రపంచంలో అత్యంత వేగంగా కాలుష్యం పెరుగుతున్న దేశం భారతదేశమని, ఇప్పటికే ఢిల్లీ నాశనమైందని, కాలుష్యం వచ్చే పరిశ్రమలకు పాలకులు అనుమతులు ఇస్తూ హైదరాబాద్‌ను ఏం చేద్దామనుకుంటున్నారో అర్థం కావడం లేదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని కాటేపల్లిలోని టైర్ల కంపెనీల కాలుష్యంపై అఖిలపక్ష సమావేశం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం నిర్వహించారు. తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షుడు డాక్టర్ పృథ్విరాజ్ యాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి హాజరైన జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. ఒకప్పుడు సమాజం కోసం దేశంకోసం పాటుపడేవారు, త్యాగాలు చేసే వారు నాయకులుగా ఉండేవారని, కానీ ఇప్పుడు సంపాదనే ధ్యేయంగా రాజకీయాల్లోకి వస్తూ, రాజకీయాన్ని వ్యాపారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకులకు ఏదైనా తెలియనప్పుడు సమాజంలో నిస్వార్థంగా ఆలోచించే మేధావులు ఎంతో మంది ఉన్నారని, వారి సలహాల ప్రకారం చేయాలి కానీ వారి సలహాలు తీసుకోవడం ఇష్టం ఉండదన్నారు. ప్రపంచంలో అన్ని దేశాలు కాలుష్యం వచ్చే పరిశ్రమలు మాకు వద్దు అంటుంటే ఆ సంస్థలను భారత్‌కు ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు ఆహ్వానిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాటేపల్లి గ్రామం మొత్తం ఐక్యం కావాలని, వారికి తాము అండగా ఉంటామని ప్రజా ఉద్యమం చేస్తేనే ప్రభుత్వం దిగి వస్తుందన్నారు. ప్రొఫెసర్ బాబూరావు మాట్లాడుతూ.. కాటేపల్లి పారిశ్రామిక ప్రాంతం కాదని, కానీ అక్కడ టైర్ల కంపెనీకి అనుమతులు ఇచ్చారంటేనే మన కాలుష్య నియంత్రణ మండలి ఎలా పనిచేస్తుందో అర్థం అవుతుందన్నారు. సదరు కంపెనీ ముందు బోర్డు కూడా లేదని, ఇటీవల సియాచీన్ కంపెనీలో 50 మంది చనిపోయారని, ఏదైనా ప్రమాదం జరిగితే గానీ పట్టించుకోరా అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ మాట్లాడుతూ.. కాటేపల్లి గ్రామంలో వ్యవసాయ భూముల మధ్య ఊరికి దగ్గరగా రెండు టైర్ల రీసైక్లింగ్ కంపెనీలకు ఎలా అనుమతులు ఇస్తారని ప్రశ్నించారు. దాని యజమాని మార్వాడీ, కానీ మన వారిని కొంతమందిని పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడని అన్నారు. సమావేశంలో విఠల్, రఘు, సుభాష్, జలంధర్, శ్రీనివాస్, వెంకట్, అరుణ, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి
జస్టిస్ చంద్రకుమార్