
తాళం వేసిన ఇంట్లో చోరీ
● 12 తులాల బంగారు ఆభరణాలు, రూ.2లక్షల నగదు అపహరణ
కోదాడరూరల్: తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి బంగారు ఆభరణాలు, నగదు అపహరించారు. ఈ ఘటన కోదాడ పట్టణ పరిధిలోని శ్రీమన్నారాయణ కాలనీలో శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీమన్నారాయణ కాలనీ ఎల్‌ఐసీ ఆఫీస్ వీధిలో నివాసముంటున్న చిన్నపిల్లల వైద్యుడు చింతలపాటి శ్రావణ్‌కుమార్ కోదాడ పట్టణంలో ఆస్పత్రి నిర్వహిస్తున్నాడు. శనివారం హాస్పిటల్‌లో పని ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో రాత్రి శ్రావణ్‌కుమార్ అక్కడే ఉండిపోగా.. అతడి భార్య పిల్లలను తీసుకుని సూర్యాపేటలోని ఆమె పుట్టింటికి వెళ్లింది. ఇది గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి వారి ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని 12 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.2లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన డాక్టర్ శ్రావణ్‌కుమార్ తాళం పగులగొట్టి ఉండటం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సీఐ శివశంకర్ ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
నల్లగొండ: నల్లగొండలోని మిర్యాలగూడ రోడ్డులో మార్బుల్ షాపు వద్ద ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి(సుమారు 60 ఏళ్లు) మృతదేహం లభ్యమైనట్లు నల్లగొండ వన్‌టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మృతుడు నలుపు రంగు చొక్కా, గళ్ల లుంగీ ధరించినట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 87126 70141 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.