
విద్యాసంస్థల్లో ర్యాగింగ్ చేస్తే చర్యలు
సూర్యాపేటటౌన్ : విద్యాసంస్థల్లో ర్యాగింగ్ చేసే విద్యార్థులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ర్యాగింగ్‌కు పాల్పడితే కళాశాల నుంచి బహిష్కరణకు గురవుతారని పేర్కొన్నారు. క్రిమినల్ కేసులు నమోదై వారి విద్య, ఉద్యోగ, భవిష్యత్తు అవకాశాలు కోల్పోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ప్రతి ఉన్నత విద్యాసంస్థలో యాంటీ ర్యాగింగ్ కమిటీలు, స్క్వార్డ్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. కొత్తగా చేరిన విద్యార్థులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని పేర్కొన్నారు. అవగాహన కార్యక్రమాలు, సెమినార్లు, వర్క్‌షాప్‌లు నిరంతరంగా నిర్వహించాలని తెలిపారు. ర్యాగింగ్ ఘటనలు ఎదురైతే బాధితులు తక్షణమే ప్రిన్సిపాల్, కళాశాల యాజమాన్యం లేదా పోలీసులను సంప్రదించాలని కోరారు. ర్యాగింగ్ సమాజంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ర్యాగింగ్‌ను పూర్తిగా నిర్మూలించడానికి విద్యాసంస్థల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు కృషి చేయాలని కోరారు.
సూర్యక్షేత్రంలో పూజలు
అర్వపల్లి : తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని చాయాసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపించారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌరహోమం నిర్వహించారు. క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, శ్రీరామకోటి స్థూపాలను భక్తులు దర్శించుకున్నారు. కార్యక్రమంలో కాకులారపు రజిత, గణపురం నరేష్, కర్నాటి నాగేశ్వర్‌రావు, బాలమురళీకృష్ణ, బీరవోలు ఇంద్రారెడ్డి, రత్నం లక్ష్మాజి, బెలిదె లక్ష్మయ్య, అర్చకులు భీంపాండే పాల్గొన్నారు.
ఎలక్ట్రిక్ ఎక్స్‌ప్రెస్
బస్సుల వేళల్లో మార్పు
అర్వపల్లి : సూర్యాపేట–జనగామ 365బీ జాతీయ రహదారిపై నడుస్తున్న ఎలక్ట్రిక్ ఎక్స్‌ప్రెస్ బస్సుల వేళల్లో ఆర్టీసీ అధికారులు మార్పులు చేశారు. ఉదయం 5గంటలకు సూర్యాపేట డిపో నుంచి మొదటి ఎలక్ట్రికల్ బస్సు మొదలవుతుంది. ఆతర్వాత ఉదయం 6.30, 7.30, 10.50, 11.50, మధ్యాహ్నం 12.50 గంటలకు బస్సులు బయలుదేరి అర్వపల్లి, తిరుమలగిరి, మోత్కూర్, భువనగిరి, ఉప్పల్‌ల మీదుగా హైదరాబాద్‌కు వెళ్తాయని ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ మేనేజర్ సైదులు తెలిపారు. ఇవే బస్సులు ప్రతి రోజు హైదరాబాద్‌లోని జేబీఎస్ నుంచి ఉదయం 5గంటలకు, 6.00, 7.00 గంటలకు, సాయంత్రం 3.15 గంటలకు, 4.30, 5.30 గంటలకు బయలుదేరి ఇదే రూట్లో తిరిగి సూర్యాపేట డిపోకు చేరుతాయని చెప్పారు.
వైభవంగా లక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకాలు చేశారు. అనంతరం శ్రీసామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం జరిపించారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్య ప్రాశన, మధుఫర్కపూజ, మాంగల్యధారణ నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు.