
‘నవోదయ’ పనులు త్వరగా పూర్తిచేయాలి
సూర్యాపేట, కోదాడ : కోదాడలో ఏర్పాటు చేయనున్న జవహర్ నవోదయ విద్యాలయం భవన నిర్మాణ పనులు సంవత్సరంలోపే పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. భవన నిర్మాణం, పురోగతిపై ఆదివారం హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసిందని, ఇప్పటికే టెండర్లు ఖరారైనట్లు పేర్కొన్నారు. నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానుండగా పనులు సంవత్సరం లోపు పూర్తి చేసేలా అధికారులు పని చేయాలని ఆదేశించారు. క్యాంపస్ వాతావరణం ఆకర్షణీయంగా ఉండాలని సూచించారు. ప్రాజెక్టు కోసం కేటాయించిన 19 ఎకరాల స్థలాన్ని విద్యా భవనాలు, హాస్టళ్లు, సిబ్బంది క్వార్టర్ల కోసం సమర్థవంతంగా ఉపయోగించాలన్నారు. ప్రతి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. సమావేశంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్, ఎన్‌వీఎస్ హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ అభిజిత్ బేరా, ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, ఎన్‌బీసీసీ హైదరాబాద్ డీజీఎం అబ్దుల్ రహీం పాల్గొన్నారు.
ఫ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి