
పట్టణాల్లో దోమల మోత
మురుగు నిలిచే ప్రాంతాలను గుర్తించాం
సూర్యాపేట అర్బన్: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో నిర్వహించిన వందరోజుల ప్రణాళిక తర్వాత కూడా పారిశుద్ధ్య నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంది. ఖాళీ స్థలాలు, లోతట్టు ప్రాంతాల్లో మురుగు నీరు నిలువ ఉండడంతో దోమల బెడదతో స్థానికులు నరకయాతన పడుతున్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే గా నిర్వహించాలని ఆదేశాలున్నా పట్టణాల్లో పరిసరాల పరిశుభ్రతను పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దోమలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.
● సూర్యాపేట మున్సిపాలిటీలోని 48 వార్డుల్లో 1,53000 జనాభా ఉంది. అంతర్గత రహదారుల్లో ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు బురద పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లడమే కాకుండా దోమల బెడద ఎక్కువైంది. ఖాసీంపేట, దురాజ్‌పల్లి, పిల్లలమర్రి, ఇందిరమ్మ కాలనీ, అంజరాపురి కాలనీల్లోని ఖాళీ ప్లాట్లలో నీరు నిలవడంతో దోమలు స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 15 రోజులకు ఒకసారి ఫాగింగ్ చేయాల్సి ఉన్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం మూడు యంత్రాలు 48 వార్డుల్లో ఫాగింగ్ చేయడానికి సరిపోవడం లేదని పలువురు పేర్కొంటున్నారు.
● కోదాడ మున్సిపాలిటీలోని నయా నగర్, అనంతగిరి రోడ్డు, భవాని నగర్, షిరిడీ సాయి కాలనీ, శ్రీమన్నారాయణ కాలనీ, 41వ వార్డులోని ఖాళీ స్థలాల్లో వర్షం నీరు నిల్వ ఉండి దోమల వృద్ధి చెంది స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మున్సిపాలిటీలో నాలుగు ఫాగింగ్ మిషన్లు ఉన్నా ఒకటే పని చేస్తోంది. వర్షాకాలం ప్రారంభం నుంచి ఒక్కసారి కూడా ఫాగింగ్ చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
● తిరుమలగిరి మున్సిపాలిటీలో దోమల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పట్టణ వాసులు ఆరోపిస్తున్నారు. నాలుగు ఫాగింగ్ యంత్రాలు పనిచేస్తున్నా అధికారులు పట్టణంలో ఫాగింగ్ చేయడంలో ఆలస్యం వహిస్తున్నారని పేర్కొంటున్నారు.
● హుజూర్‌నగర్ మున్సిపాలిటీలోని అంబేద్కర్ కాలనీ, గోవిందాపురం, మట్టపల్లి బైపాస్ రోడ్డు, చెరువు కాలనీలో పలు చోట్ల ఖాళీ ప్లాట్లలో మురుగు నీరు నిలిచి దోమలు విజృంభిస్తున్నాయి. హుజూర్‌నగర్‌లో రెండు ఫాగింగ్ మిషన్లు ఉన్నా సమయానికి ఫాగింగ్ చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
● వర్షం వచ్చినప్పుడు నేరేడుచర్ల మున్సిపాలిటీలో ని ఎన్టీఆర్ నగర్, నర్సయ్య గూడెంలో వరద నీరు నిలిచి ఆయా ప్రాంతాల వాసులు ఇబ్బందులు పడుతున్నారు. నిల్వ ఉన్న నీటిలో దోమలు వృద్ధి చెంది స్థానికుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నేరేడుచర్ల మున్సిపాలిటీలో రెండు ఫాగింగ్ యంత్రాలు ఉన్నా.. సరైన సమయంలో ఫాగింగ్ చేయడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు.
ఫ ఐదు మున్సిపాలిటీల్లో వందరోజుల ప్రణాళిక తర్వాత కూడా
పారిశుద్ధ్య నిర్వహణ అంతంతే
ఫ ఫాగింగ్‌ను విస్మరించిన అధికారులు
ఫ ప్రతి శుక్రవారం డ్రైడే గా
నిర్వహించాలని ఆదేశాలున్నా
పట్టించుకోవడం లేదని విమర్శలు
సూర్యాపేట పట్టణంలో మురుగు నీరు నిల్వ ఉండే ప్రాంతాలను ఇప్పటికే గుర్తించాం. మురుగునీరు నిలిచే ఖాళీ ప్లాట్ల యజమానులకు నోటీసులు జారీ చేస్తాం. నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో దోమల లార్వా వృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్ వేయిస్తున్నాం. – హనుమంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్, సూర్యాపేట