
చెరువుకు చేప
జిల్లాలోని మత్స్యకారులకు నాణ్యమైన చేప పిల్లల అందించేలా ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే నెలలో చెరువుల్లోకి చేపపిల్లలను వదలేలా చూస్తాం. చేప పిల్లల పంపిణీతో మత్స్యకారులకు మేలు జరగనుంది.
– నాగులునాయక్,
జిల్లా మత్స్యశాఖ అధికారి
భానుపురి (సూర్యాపేట) : చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది దాదాపు 3,41,18,033 చేపపిల్లలను జిల్లాలోని జలాశయాల్లో వదలాలని నిర్ణయించింది. ఈ మేరకు చేప పిల్లల సరఫరాకు గాను ఏజెన్సీ ఎంపిక కోసం అధికారులు టెండర్లు ఆహ్వానించారు. ఈ ప్రక్రియ నెలాఖరునాటికి పూర్తి కానుంది. ఆ తర్వాత చెరువులు, కుంటల్లో చేప పిల్లలు వదలనున్నారు. అయితే గతంలో టెండర్ల నుంచి పంపిణీ వరకు అన్నీ అక్రమాలే జరిగినట్లు మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది టెండర్లు, పంపిణీలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా సాఫీగా జరిగేలా చూడాలని మత్స్యకారులు కోరుతున్నారు.
టెండర్ల దశలో ప్రక్రియ
సూర్యాపేట జిల్లాలో 165 మత్స్య సొసైటీలు ఉన్నాయి. ఇందులో 15,540 మంది సభ్యులు ఉన్నారు. దాదాపు వెయ్యికి పైగా చెరువులు, కుంటలు ఉన్నాయి. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గత ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని చేపట్టింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా దీనిని కొనసాగించనుంది. ఈనేపథ్యంలో ఈ సారి 621 చెరువులు, కుంటల్లో చేపపిల్లలను వదలాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇటీవల టెండర్లను ఆహ్వానించింది. ఈ ప్రక్రియ ఈనెలాఖరు నాటి వరకు కొనసాగనుంది. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టెండర్లను ఓపెన్ చేయనున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు చేపపిల్లలను సరఫరా చేసే ఏజెన్సీలను ఎంపిక చేస్తారు. ఈ ఎంపికకు క్షేత్రస్తాయి పరిశీలనను సైతం జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలిస్తుంది.
మూడు రకాలుగా..
జిల్లాలో కాలానుగుణంగా సీజనల్, శాశ్వతంగా నీరు ఉండే చెరువులు కుంటలే కాకుండా జలాశయాలు ఉన్నాయి. వీటిలో ఎంపిక చేసిన చెరువులు, కుంటల్లోనే ఈ ఏడాది చేపపిల్లలను వదలన్నారు. శాశ్వతంగా నీరు ఉండే 188 చెరువులు, కుంటల్లో 80 –100 ఎంఎం సైజ్ ఉన్న చేపపిల్లలు 2,05,51,248 , అదే సైజ్‌లో ఉండేవి రెండు జలశయాల్లో 37,98,902 చేపపిల్లలను అధికారులు వదలనున్నారు. సీజనల్‌గా నీరు ఉండే జిల్లాలోని 431 చెరువుల్లో 35 నుంచి 40 ఎంఎం సైజ్ గల 97,67,883 చేపపిల్లలను సరఫరా చేసేందుకు ఈ టెండర్లను పిలిచారు.
ఈ ఏడాది 3.41కోట్ల చేప పిల్లలు వదలాలని లక్ష్యం
ఫ టెండర్లు ఆహ్వానించిన అధికారులు
ఫ ఈనెలాఖరుకు ప్రక్రియ పూర్తి
ఫ వచ్చేనెలలో పంపిణీకి సన్నాహాలు

చెరువుకు చేప