
బొలేరో వాహనం ఢీకొని బాలిక మృతి
కొండమల్లేపల్లి: బొలేరో వాహనం ఢీకొని బాలిక మృతి చెందింది. ఈ ఘటన కొండమల్ల్లేపల్లి మండలం కొల్‌ముంతల్‌పహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని బాపూజీనగర్ వద్ద మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్‌ముంతలపహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని బాపూజీనగర్‌కి చెందిన పీట్ల రాజు, సంధ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. రాజు కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో ఉంటూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వినాయక చవితి పండుగ సందర్భంగా సోమవారం బాపూజీనగర్‌కు వచ్చారు. మంగళవారం ఉదయం రాజు కుమార్తె అక్షర(4) తన నానయమ్మ సుగుణమ్మతో కలిసి బాపూజీనగర్‌లో రోడ్డు దాటుతుండగా.. దేవరకొండ నుంచి కొండమల్లేపల్లి వైపు వేగంగా వస్తున్న బొలేరో వాహనం అక్షరను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అక్షరను దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అజ్మీరా రమేష్ తెలిపారు.