
విహారం కావొద్దు విషాదం
● సాగర్ సందర్శనకు వచ్చేవారు
అప్రమత్తంగా ఉండాలని సూచన
● జలాశయంలోకి దిగొద్దని హెచ్చరిక
● సూచిక బోర్డులు, ట్రంచ్‌ల ఏర్పాటు
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతుండడంతో సాగర్ అందాలను చూసేందుకు పర్యాటకులు, యువత భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో కొందరు సాగర్ పరిసర ప్రాంతాల్లో, దయ్యాలగండి పుష్కర ఘాట్ వద్ద జలాశయంలోకి దిగడం వంటివి చేస్తున్నారు. అదేవిధంగా సెల్ఫీలు, ఫొటోలు తీసుకునే క్రమంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఒక్కసారిగా కాలు జారి నీటిలో పడితే బయటకు రావడం కష్టమని రక్షణ సిబ్బంది చెబుతున్నారు. గతంలో పలువురు యువకులు నీటిలో ఈత కొడుతూ, ఫొటోలు దిగుతూ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో షార్ట్ వీడియోలు, సెల్ఫీలు ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో యువత జలాశయం నీటిలో దూకుతూ, లోతైన ప్రదేశాల్లో ఈత కొడుతూ వీడియోలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పెట్టడం ఫ్యాషన్‌గా మారింది. అనుకోని ఘటన జరిగితే ప్రాణాలనే ప్రమాదమని గుర్తించాలని స్థానికులు, అధికారులు సూచిస్తున్నారు.
అధికారుల ఏర్పాట్లు..
పర్యాటకుల భద్రత కోసం సాగర్ తీరం వెంట అధికారులు, పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. దయ్యాలగండి వద్ద గల పుష్కర ఘాట్ వద్దకు వెళ్లకుండా రోడ్డు వెంట లోతైన ట్రంచ్ కొట్టారు. కొన్ని చోట్ల పోలీసులు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేస్తున్నారు. అయినప్పటికీ కొందరు ఆ సూచనలను పట్టించుకోవడం లేదని అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

విహారం కావొద్దు విషాదం