
మేకలు అపహరిస్తున్న ముఠా అరెస్ట్
నల్లగొండ: రాత్రి వేళ కార్లలో మేకలు అపహరిస్తున్న 16 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ తెలిపారు. మంగళవారం ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం రాత్రి శాలిగౌరారం సమీపంలోని బైరవోని బండ ఎక్స్ రోడ్డులో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. అటుగా కారులో వచ్చిన వారు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు కారును వెంబడించి పట్టుకున్నారు. కారులో అనుముల మండలం అలీనగర్‌కు చెందిన సంపంగి వెంకటేష్, సంపంగి శారద, మునుగోడు మండలం గూడపూర్‌కు చెందిన వేంరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నిడమనూరుకు చెందిన దాసర్ల వినోద్‌కుమార్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి ఫింగర్ ప్రింట్స్ స్కాన్ చేయగా వారిపై గతంలో మేకలు చోరీ చేసిన కేసు ఉన్నట్లు తేలింది. పట్టుబడిన నలుగురిని విచారించి.. వారితో పాటు మేకలు చోరీ చేస్తున్న మర్రిగూడ మండలం శివన్నగూడేనికి చెందిన వరికుప్పల రవి, రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌కు చెందిన గండికోట శివకుమార్, ఏపీలోని పల్నాడు జిల్లా గురజాల మండలం ఎస్సీ కాలనీకి చెందిన అమ్ములూరి విజయ్, హైదరాబాద్‌లోని మియాపూర్‌కు చెందిన లింగాల అశోక్, ఉండం కళ్యాణి, భువనగిరి హౌజింగ్‌బోర్డు కాలనీకి చెందిన వల్లెపు ప్రసాద్, మహబూబ్‌నగర్ జిల్లా బాలనగర్ మండలం పెద్దాయిపల్లికి చెందిన మద్యాల సహదేవ్, సూర్యాపేట జిల్లా మోతెకు చెందిన కోడిసె వంశీకృష్ణ, కంపాటి హుస్సేన్, కంపాటి అజయ్‌కుమార్, మట్టి సురేష్‌ను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. వీరంతా కలిసి నాలుగు ముఠాలుగా ఏర్పడి కార్లలో పగటిపూట రెక్కీ నిర్వహించి రాత్రి వేళ మేకలను కార్లలో వేసుకొని చోరీలకు పాల్పడుతున్నారని ఎస్పీ తెలిపారు. వీరు నల్లగొండ జిల్లాలో 15 చోట్ల, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లతో పాటు మహబూబ్‌నగర్, నాగర్‌ర్నూల్ జిల్లాల పరిధిలో 10 చోట్ల మేకలు అపహరించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. దొంగలించిన మేకలను సంతలలో గుర్తుతెలియని వ్యక్తులకు అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవారని ఎస్పీ వివరించారు. వారి నుంచి రూ.2.46లక్షల నగదు, 22 గొర్రెలు, 8 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ముఠాలోని కోటేష్, కనుకుల బేబీ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి ఆద్వర్యంలో నిందితులను పట్టుకున్న నల్లగొండ సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ ఎం. జితేందర్‌రెడ్డి, ఎం. నాగభూషణ్, కె. కొండల్‌రెడ్డి, శాలిగౌరారం ఎస్‌ఐ, నార్కట్‌పల్లి సీఐ, పోలీస్ సిబ్బంది, సీసీఎస్ సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేసి రివార్డు ప్రకటించారు.
రూ.2.46లక్షల నగదు, 22 గొర్రెలు, 8 కార్లు స్వాధీనం
వివరాలు వెల్లడించిన
నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్

మేకలు అపహరిస్తున్న ముఠా అరెస్ట్