
‘స్థానిక’ ఎన్నికల కసరత్తు ముమ్మరం
భానుపురి (సూర్యాపేట) : స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. అందులో భాగంగా మంగళవారం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ క్రమంలో నోటిఫై చేయబడిన అన్ని గ్రామ పంచాయతీల్లో ఫొటోతో కూడిన ఓటర్ల జాబితాను తయారు చేసి ప్రచురించాలని జిల్లా పంచాయతీ అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ కోసం షెడ్యూల్ సైతం విడుదల చేసింది.
జిల్లాలో 6,92,511 మంది ఓటర్లు
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే పంచాయతీ ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. ఈ జాబితా ప్రకారం జిల్లాలోని 486 గ్రామ పంచాయతీల్లో 6,92,511 మంది పంచాయతీ ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3,39,857 మంది, మహిళలు 3,52,633 మంది ఉన్నారు. మరో 21 మంది ఇతరులు నమోదయ్యారు. 4388 వార్డులు ఉండగా 4,403 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం
వచ్చేనెల 2 నాటికి తుది జాబితా
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో కీలకమైన ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై తుది జాబితాలు రూపొందించాలని ఎన్నికల సంఘం డీపీఓలను ఆదేశించింది. ఈ మేరకు 28వ తేదీలోపు గ్రామపంచాయతీల్లో డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు ప్రకటించాల్సి ఉంది. అలాగే 29న జిల్లాస్థాయిలో ఈ డ్రాఫ్ట్ ఓటర్ లిస్టుపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం, 30న మండల స్థాయిలో పార్టీల ప్రతినిధులతో ఎంపీడీఓలు సమావేశాలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ సమావేశాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి వచ్చే అభ్యంతరాలను ఈనెల 31 నాటికి తొలగించి, వచ్చే నెల 2వ తేదీన గ్రామ పంచాయతీల వారీగా ఫొటోతో కూడిన ఓటర్ జాబితాను ప్రకటించనుంది.
ఫ తుది ఓటరు జాబితా
విడుదలకు నోటిఫికేషన్
ఫ 29న డ్రాఫ్ట్ ఓటర్ లిస్టుపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
ఫ వచ్చే నెల 2న ఫొటో ఓటరు
జాబితా ప్రకటన