
రెండో జత యూనిఫాం ఎప్పుడో!
వస్త్రం త్వరలోనే రానుంది
సూర్యాపేటటౌన్ : విద్యా సంవత్సరం మొదలై రెండు నెలలు దాటినా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నేటికీ ఒక్క జత యూనిఫాం మాత్రమే అందజేశారు. రెండో జత యూనిఫామ్ కోసం జిల్లాల వారీగా వస్త్రాన్ని జూలైలో ఉన్నతాధికారులు అందించారు. 15 ఆగస్టు వరకు రెండో జత ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినా నేటికీ అతిగతీ లేదు. ఒక్క జతతోనే విద్యార్థులు రోజూ పాఠశాలలకు వచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జిల్లాకు చేరని చొక్కా వస్త్రం..
అయితే కొన్ని జిల్లాల్లో పూర్తి స్థాయిలో రెండో జతకు సంబంధించి వస్త్రం వచ్చి కుట్టుపని సైతం పూర్తి కావచ్చినట్టు సమాచారం. అయితే మన జిల్లాకు మాత్రం ఇప్పటి వరకు రెండో జత కోసం బాలబాలికలకు పైజామా, నిక్కర్లు, ఫ్యాంట్ వస్త్రాలు మాత్రమే వచ్చాయి. చొక్కా వస్త్రం అందాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ స్వాతంత్య్ర దినోత్సవం రోజు రెండో జత అందే అవకాశం లేకుండా పోయింది. రోజు ఒక్క జతే వాష్ చేసుకొని అదే వేసుకొని స్కూల్‌కు వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్షాకాలం కావడంతో ఒకే జత ఉతికితే మళ్లీ అది ఆరకపోవడంతో విద్యార్థులు పాఠశాలకు సివిల్ డ్రెస్‌లోనే వస్తున్నారు.
కొత్తవారికీ అందని యూనిఫామ్
జిల్లాలో ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలు 950 ఉన్నాయి. వీటిలో 23,547 మంది బాలురు, 25,827 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి ఒక్కో జత చొప్పున 49,374 జతలు కుట్టించి పాఠశాలలు పునఃప్రారంభం రోజు నుంచే విద్యార్థులకు అందజేశారు. అయితే జూన్‌లో ఉపాధ్యాయులు నిర్వహించిన బడిబాటలో 5,500 మంది విద్యార్థుల వరకు అడ్మిషన్లు వచ్చాయి. వీరికి కూడా అదనంగా యూనిఫామ్స్ అందించాల్సి ఉంది.
ప్రస్తుతం రెండో జతకు సంబంధించి నిక్కర్, పైజామా, ఫ్యాంట్‌లకు సంబంధించి వస్త్రం వచ్చింది. ఆయా మండలాల ఎంఈఓలకు పంపించాం. చొక్కా సంబంధించి కూడా త్వరలోనే వస్తుంది. రెండో జత యూనిఫాం కూడా సకాలంలోనే అందిస్తాం.
– రాంబాబు, జిల్లా సెక్టోరియల్ అధికారి
ఫ ఇప్పటి వరకు ఒక్క జతే పంపిణీ
ఫ ఈనెలలో రెండో జత అందించాలని ప్రభుత్వం ఆదేశం
ఫ వస్త్రం రాకపోవడంతో ఆగిన ప్రక్రియ
ఫ జిల్లా వ్యాప్తంగా 950 స్కూళ్లు..
49,374 మంది విద్యార్థులు