
సాక్షి, సూర్యాపేట జిల్లా: కోదాడలో సీఎంఆర్ఎఫ్ కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. ముఠా బాగోతాన్ని ఆధారాలతో సహా సాక్షి టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. కోదాడ కేంద్రంగా సాగిన ఈ స్కాంలో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఏ1 చెడపంగు నరేష్, ఏ2 మర్ల వీరబాబు, ఏ3 ఉప్పల మధు, ఏ4 సురగాని రాంబాబు, ఏ5 గుంటక సందీప్, ఏ6 రంగశెట్టి వెంకట్రావులను కటకటాల్లోకి పంపించారు.
మొత్తం 44 సహాయ నిధి చెక్కులకు గాను 38 చెక్కులను ముఠా విత్ డ్రా చేసింది. మరో ఆరు చెక్కులను విత్ డ్రా చేసేందుకు ప్లాన్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.9.30 లక్షల నగదు, ఆరు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వద్ద ఇద్దరు నిందితులు వీరబాబు, మధు పీఏలుగా చేశారు.
నరేష్ మల్లయ్య యాదవ్ సోషల్ మీడియా కో- ఆర్డినేటర్‌గా పనిచేశాడు. సూరగాని రాంబాబు మునగాల మండలం నారాయణపురం స్థానిక నేత. గుంటక సందీప్ శాసనమండలిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి. నకిలీ అకౌంట్స్ ద్వారా నగదు కొట్టేసిన ముఠా వాటాలు పంచుకుంది. నకిలీ అకౌంట్స్ దారులకు నిందితులు పర్సంటేజ్ ఇచ్చారు. కాగా, ముఠా సభ్యులు, బాధితులు ఇంకా ఉన్నట్లు సమాచారం.
కొద్దిరోజుల కిందట సూర్యాపేట జిల్లా కోదాడ కేంద్రంగా కల్యాణలక్ష్మి చెక్కుల కుంభకోణం బయటపడగా.. తాజాగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కుంభకోణం వెలుగు చూసింది. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను కొంత మంది ముఠాగా ఏర్పడి పక్కదారి పట్టించారు. గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఈ వ్యవహారం తాజాగా వెలుగు చూసింది.
కోదాడ నియోజకవర్గ పరిధిలోని వాయిలసింగారం గ్రామానికి చెందిన గద్దె వెంకటేశ్వరరావు అనారోగ్యానికి గురయ్యారు. ఆయన హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని.. నిరుపేద కావడంతో సీఎం రిలీఫ్ ఫండ్ 2023 లో దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు లక్షా యాభై వేల రూపాయలు మంజూరయ్యాయి. చెక్కును కూడా ప్రభుత్వం అప్పటి ఎమ్మెల్యే కార్యాలయానికి పంపింది. కానీ ఎమ్మెల్యే కార్యాలయంలో పని చేస్తున్న వ్యక్తిగత కార్యదర్శి బాధితుడికి ఈ చెక్కును ఇవ్వకుండా గడ్డం వెంకటేశ్వరరావు అనే మరో వ్యక్తికి ఇచ్చి దానిని ఏపీలోని జగ్గయ్యపేటలో మార్చుకున్నారు.
అనంతరం ఆ డబ్బును ముఠాగా ఏర్పడిన వ్యక్తులు పంచుకున్నారు. తాను దరఖాస్తు చేసుకున్నప్పటికీ చెక్కు రాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు దీనిపై విచారణ చేయగా చెక్కును జగ్గయ్యపేటలో మార్చుకున్నట్లు తేలడంతో కోదాడ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే ముఠా సభ్యులు అదే పేరుతో ఉన్న వ్యక్తులను స్థానికంగా వెతికి పట్టుకునేవారు.
చెక్కులపై ఇంటిపేరు పూర్తిగా కాకుండా ఇంగ్లిష్ అక్షరాల్లో వస్తుం డటంతో నిందితులు దీన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. చెక్కుల మీద బ్యాంక్ అకౌంట్ నంబర్ బాధితులది కాకుండా తాము ఎంపిక చేసిన వ్యక్తుల అకౌంట్ నంబర్ వచ్చే విధంగా హైదరాబాద్ సచివాలయంలో పనిచేసే వ్యక్తి సాయంతో తారుమారు చేసేవారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.