ఇందిరమ్మ ఇళ్లు పూర్తయ్యేలా చూడాలి
భానుపురి (సూర్యాపేట) : జిల్లాకు మొదటి విడతలో మంజూరై నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. బుధవారం ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, పారిశుద్ధ్యంపై అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులతో వెబెక్స్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు 12,868 ఇందిరమ్మ ఇళ్లకుగాను ఫేజ్ వన్‌లో 4322 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఫేజ్ టూలో 8,546 లక్ష్యం ఉండగా 2017 లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందని, మండల స్పెషల్ అధికారులు త్వరగా ఎంపిక పూర్తి చేసి నివేదిక సమర్పించాలన్నారు. రాజీవ్ యువ వికాసంలో భాగంగా జిల్లాలో 60,085 దరఖాస్తులకు 57,985 పరిశీలన చేసి బ్యాంకులకు పంపించామన్నారు. మిగిలిన దరఖాస్తులను అధికారులు త్వరగా పరిశీలించి బ్యాంకులకు పంపాలన్నారు. భారీ వర్షాలు కురుస్తున్నందున జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు, నివాస ప్రాంతాల వద్ద మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ వీవీ అప్పారావు, హౌసింగ్ పీడీ ధర్మారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ నాయక్, డీఎండబ్ల్యూఓ జగదీశ్వర్‌రెడ్డి, ఎల్‌డీఎం బాపూజీ, డీపీఓ యాదయ్య అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


