ఇదేం చోద్యం.. ఏకంగా చెరువు భూమినే తనఖా పెట్టేశారు! | Sakshi
Sakshi News home page

ఇదేం చోద్యం.. ఏకంగా చెరువు భూమినే తనఖా పెట్టేశారు!

Published Thu, Nov 17 2022 4:44 PM

Hyderabad: Ghatkesar Nadem Cheruvu Lake Land Mortgaged - Sakshi

పట్టాదారులమంటూ.. కోర్టు ఆదేశం ఉందంటూ పోలీసులు బందోబస్తుతో నాడెం చెరువు తూమును ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకోవడంతో ధ్వంసం చేయించిన వారు తోక ముడిచారు. ఆ తర్వాత బుల్డోజర్‌ను సీజ్‌ చేసి కారకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదంతా మూడు నెలల క్రితం జరిగిన సంఘటన. తాజాగా హైదరాబాద్‌ చిక్కడపల్లిలోని ఓ బ్యాంకులో చెరువు భూమిని తనఖా పెట్టి రూ.12కోట్ల రుణం తీసుకోవడంతో నాడెం చెరువు పేరు తిరిగి తెరపైకి వచ్చింది.


ఘట్‌కేసర్‌:
చెరువులు, కుంటలు, జల వనరుల సంక్షరణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. కాని క్షేత్రస్థాయిలో పరిస్థితి వారి మాటలకు భిన్నంగా ఉంది. నిబంధనలకు విరుద్ధంగా చెరువులు కబ్జా చేస్తున్న వారిపై చర్యలు లేకపోవడంతో చెరువులు, కుంటలు కనుమరుగవుతున్నాయి. తాజాగా వెంకటాపూర్‌ నాడెం (నల్ల) చెరువులోని భూమిని తనఖా పెట్టి కొందరు రూ.12 కోట్ల రుణం తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. నాడెం చెరువుపై ఆధారపడి వెంకటాపూర్‌కు చెందిన 105 మంది ముదిరాజ్‌ మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు. 

నీటిని తొలగించే అధికారం లేకున్నా... 
రెవెన్యూ రికార్డులో ఉన్న చెరువును అందులో ఉన్న నీటిని తొలగించే అధికారం నీటి పారుదల శాఖ అధికారులకే ఉంది. నాడెం చెరువులో నీరు లేదంటూనే చెరువులో చేపలు పట్టొందంటూ కొందరు కోర్టు నుంచి ఇంజెక్షన్‌ ఆర్డర్‌ తెచ్చుకున్నారు. కోర్డు ఆర్డర్‌ ఉందని ఆగస్టు 3, 2022న పోలీస్‌బందో బస్తుతో చెరువు కల్వర్టును ధ్వంసం చేశారు. మత్స్యకారులు చెరువులోకి దిగితే కేసులు పెడతామని పోలీసులు బెదిరించారని మత్స్యకారులు గతంలో ఆరోపించారు. తక్షణమే రంగంలోకి దిగిన రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు కోర్టు ఆదేశం చూపించాలని కోరడంతో తోక ముడుచుకున్నారు.
 

పోలీసుల అండతోనే ధ్వంసం.. 

చెరువులో చేపలు పడితే కేసు పెడతామని గతంలో పోలీసులు బెదిరించారని మత్స్యకారులు పేర్కొన్నారు. పోలీసుల అండతోనే అక్రమార్కులు కల్వర్టు ధ్వంసం చేశారని అప్పట్లో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. మత్స్యకారుల నుంచి విషయం తెలుసుకున్న అధికారులు తూము ధ్వంసాన్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత అక్రమార్కులపై రెవెన్యూ, ఇరిగేషన్, రోడ్డు భవనాల శాఖాధికారులు ఘట్‌కేసర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దుండగులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం.

ఎన్‌ఓసీ ఇవ్వలేదు 
ఈ విషయమై తహసీల్దార్‌ విజయలక్ష్మి, ఇరిగేషన్‌ ఏఈ పరమేశ్‌ను వివరణ కోరగా బ్యాంకు రుణం కోసం మేము ఎటువంటి ఎన్‌ఓసీ ఇవ్వలేదని తెలిపారు. బ్యాంకు డాక్యూమెంట్లు చూస్తే కాని ఏమి చెప్పలేమని పేర్కొన్నారు.


చెరువు విస్తీర్ణం 62 ఎకరాలు
 
మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం వెంకటాపూర్‌ సర్వేనంబర్‌ 814, 816లో 62 ఎకరాల విస్తీర్ణంలో నాడెం చెరువును నీటి పారుదల శాఖ అధికారులు గుర్తించారు. ఘట్‌కేసర్‌ పరిసరాల్లో భూమి విలువ పెరగడంతో అక్రమార్కుల కన్ను చెరువుపై పడింది. రాజకీయ నాయకుల అండతో నీటిని తొలగించి చెరువు లేకుండా చేయాలని యత్నిస్తున్నారు.

చెరువులోని భూమికి రుణం ఎలా ఇచ్చారు.?
భూమి పరిశీలించకుండానే చెరువులో నీట మునిగిన భూమికి బ్యాంకు ఎలా రుణం ఇచ్చిందని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. లక్ష రుణం కోసం చెప్పులరిగేలా తిప్పుకునే బ్యాంకు అధికారులు నీటిలో ఉన్న భూమికి రుణం ఇవ్వడమేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. (క్లిక్‌ చేయండి: స్వామి వారి పేరు మార్చి... రికార్డులు ఏమార్చి!)

Advertisement
 
Advertisement
 
Advertisement