గ్రంథాలయం.. దయనీయం..! | - | Sakshi
Sakshi News home page

గ్రంథాలయం.. దయనీయం..!

Nov 16 2026 12:32 AM | Updated on Nov 16 2026 12:32 AM

సద్వినియోగం చేసుకోవాలి..

పోటీ పరీక్షలకు సంబంధించి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

– డి.సాయమ్మ, లైబ్రేరియన్‌, పాతపట్నం శాఖ గ్రంథాలయం

పుస్తకాలు తేవాలి

పోటీ పరీక్షలకు అవసరమైన కొత్త పుస్తకాలు అందుబాటులో ఉంచాలి. గ్రంథాలయాల్లో మౌలిక వసతులు కల్పించాలి. ఇంటర్నెట్‌తో కూడిన కంప్యూటర్లు ఏర్పాటుచేయాలి. వసతులు మెరుగుపరచాలి.

– టి.నారాయణరావు, పాఠకుడు, హిరమండలం

హిరమండలం: విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాల పరిస్థితి క్రమేణా దయనీయంగా మారుతోంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు జ్ఞానాన్ని పంచే లైబ్రరీల నిర్వహణను పట్టించుకునే వారు కరువవుతున్నారు. మౌలిక వసతులు లేకపోగా.. పాఠకులకు అవసరమైన పుస్తకాలు కూడా అందుబాటులో ఉండటం లేదు. ఇక సిబ్బంది పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పూర్తిస్థాయిలో లేకపోవడంతో ఉన్న సిబ్బందిపై అదనపు భారం పడుతోంది. ఆపై సకాలంలో జీతాలు అందడం లేదు. ప్రస్తుతం వివిధ పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలు లేకపోవడంతో వారికి ఇబ్బందులు తప్పేలా లేవు.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో ఒక కేంద్ర గ్రంథాలయం, 44 శాఖ, 5 గ్రామీణ గ్రంథాలయాలు ఉన్నాయి. 111 పుస్తక నిక్షిప్త కేంద్రాలు కొనసాగుతున్నాయి. శాఖా గ్రంథాలయంలో లైబ్రేరియన్‌, అటెండర్‌, గ్రామీణ గ్రంథాలయాల్లో విలేజ్‌ లైబ్రేరియన్‌ ఉండాలి. అన్ని గ్రంథాలయాల్లో కలిపి 107 మంది సిబ్బంది గాను ప్రస్తుతం 33 మంది మాత్రమే ఉన్నారు. 13 మంది అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది పనిచేస్తున్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పరిస్థితి మరింత తీసికట్టుగా మారింది. అక్కడ 11 మంది సిబ్బందికి గాను ముగ్గురు, నలుగురు మాత్రమే ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా మంది లైబ్రేరియన్లు ఒకటి కంటే ఎక్కువ గ్రంథాలయాల బాధ్యతలు చూడాల్సి వస్తోంది. దీంతో వారిపై అదనపు భారం పడుతోంది.

ఉద్యోగ ప్రయోజనాలు లేక..

అన్నిరకాల పోటీ పరీక్షలకు సంబంధించి పుస్తకాలు గ్రంథాలయాల్లో అందుబాటులో ఉండటం లేదు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయి. అయితే అందుకు సిద్ధమయ్యే అభ్యర్థులు గ్రంథాలయాలకు వెళుతుంటే పోటీ పరీక్షలకు సంబంధించి పుస్తకాలు కనిపించడం లేదు. దీంతో వారు అధిక ధరకు బయటే పుస్తకాలు కొనుగోలు చేసి ప్రిపరేషన్‌ కావాల్సి వస్తోంది. మరోవైపు గ్రంథాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి సకాలంలో వేతనాలు అందడం లేదు. ఉద్యోగ విరమణ పొందిన వారికి న్యాయబద్ధంగా చెల్లింపులు జరగడం లేదు.

పింఛన్లు అందించకపోగా ఉద్యోగ ప్రయోజనాలు సైతం రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు గ్రంథాలయాలకు వస్తున్న విద్యుత్‌ బిల్లులు కూడా చెల్లించేందుకు ఇబ్బందిపడుతున్నామని సిబ్బంది వాపోతున్నారు. స్థానిక సంస్థలు కొన్ని గ్రంథాలయాలకు సెస్‌ కూడా చెల్లించడం లేదు. ఇప్పటివరకూ సుమారు రూ.10 కోట్ల వరకూ బకాయిలు ఉన్నట్టు తెలుస్తోంది. నిధుల కొరత కారణంగా కొన్ని పత్రికల చందాలు కూడా కట్టలేని స్థితిలో లైబ్రేరియన్లు ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

లైబ్రేరియన్‌ లేని హిరమండలం శాఖా గ్రంథాలయం

పూర్తిస్థాయిలో అందుబాటులో లేని పోటీ పరీక్షల పుస్తకాలు

107 మంది సిబ్బందికిగాను ఉన్నది

33 మందే

భారంగా మారిన లైబ్రరీల నిర్వహణ

దృష్టి సారించని కూటమి ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement