రాగోలులో దొంగల హల్‌చల్‌ | - | Sakshi
Sakshi News home page

రాగోలులో దొంగల హల్‌చల్‌

Nov 16 2026 12:32 AM | Updated on Nov 16 2026 12:32 AM

శ్రీకాకుళం రూరల్‌: రాగోలు జంక్షన్‌లో దొంగలు హల్‌చల్‌ సృష్టించారు. టిఫిన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న ఓ రేకుల షెడ్‌లోకి శనివారం అర్ధరాత్రి ముగ్గురు దొంగలు చొరబడేందుకు ప్రయత్నించారు. కుటుంబ సభ్యులు గమనించి కేకలు వేయడంతో ఇద్దరు పరారవ్వగా, ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. నిందితుడిని ఆదివారం రూరల్‌ పోలీస్టేషన్‌కు అప్పగించారు. పట్టుబడిన వ్యక్తి పూసపాటిరేగ మండలం చింతపల్లి గ్రామానికి చెందిన బెవర శిమ్మయ్యగా పోలీసులు గుర్తించారు. పోలీసులు విచారించగా శ్రీకాకుళంలోని దుస్తులు కొనడానికి వచ్చామని చెప్పినట్లు తెలిసింది. బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.

సెంచరీతో అదరగొట్టిన వెంకటేశ్వరరావు

వజ్రపుకొత్తూరు: ఉద్దానం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన అంధ క్రికెటర్‌ దున్న వెంకటేశ్వరరావు బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరుగుతున్న బ్‌లైండ్‌ 2వ ఏసియా కప్‌లో అదరగొట్టాడు. ఆదివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 50 బంతుల్లో సెంచరీ చేసి ఇండియాను విజయ తీరాలకు తీసుకెళ్లినట్లు మిత్రుదు దున్న కృష్ణారావు విలేకరులకు తెలిపారు. ఈ నెల 13 నుంచి ఢాకాలో ఇండియా శ్రీలంక, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్గనిస్తాన్‌, నేపాల్‌ దేశాలతో కలిసి టోర్నమెంట్‌ జరుగుతోందన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావును మాజీ సర్పంచ్‌లు చింత హేమారావు, చింత నారాయణమూర్తి, తదితరులు అభినందించారు.

రోడ్డు పక్కనే పశువులు..

పొంచి ఉన్న ప్రమాదాలు

లావేరు : జాతీయ రహదారిని ఆనుకుని సర్వీసు రోడ్డు వద్ద కొందరు పశువులు కడుతుండటం ప్రమాదకరంగా మారింది. బుడుమూరు, తాళ్లవలస, బొంతుపేట, పడిశాలిపేట, తదితర గ్రామాల వద్ద రోడ్డుకు ఆనుకుని పశువులను కట్టడంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దూరప్రాంతాల నుంచి బైక్‌లు, కార్లుతో ప్రయాణించే వారు ఈ గ్రామాల వద్దకు చేరే సరికి పశువులు అడ్డంగా ఉండటంతో తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. హైవే అధికారులు, పోలీసులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

నైరాలో రక్తదాన శిబిరం

శ్రీకాకుళం రూరల్‌: నైరా వ్యవసాయ కళాశాలలో ఆదివారం రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పొన్నాం గొల్లపేట గ్రామస్తులతో పాటు నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 120 మంది రక్తదానం చేశారు. ముందుగా రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌ పి.జగన్మోహనరావు, కళాశాల అసోసి యేట్‌ డీన్‌ డి.చిన్నంనాయుడు శిబిరాన్ని ప్రారంబించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం ఆరోగ్యకరమని, ఒకరి ప్రాణాన్ని కాపాడుతున్న సంతోషం మనకు కలుగుతుందని చెప్పారు. అనంతరం రక్తదాతలకు ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారులు వి.రాజేంద్రప్రసాద్‌, జగన్మోహన్‌, కె.రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement