ఎచ్చెర్ల : కనీస వేతనాలు రూ.42 వేలు ఇవ్వాలని, లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ డిసెంబర్ 1, 2, 3 తేదీలలో చేపట్టనున్న చలో ఢిల్లీ జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్.వి.రమణ పిలుపునిచ్చారు. ఆదివారం అరిణాం అక్కివలస వద్దనున్న శ్యాంపిస్టన్ ప్లాంట్–3 వద్ద పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడంతో కార్మికులు పేదలుగా మారుతుంటే, కొందరు యజమానులు కుబేరులుగా మారుతున్నారని, ఈ విధానానికి స్వస్తి పలకాలన్నారు. కార్పొరేట్లకు వత్తాసు పలుకుతూ కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో కంపెనీ వర్కర్స్, యూనియన్ నాయకులు పి.నాగరాజు, ఎం.అశోక్, ఎల్.చక్రవర్తి, జె.సురేష్, ఎం.నాగభూషణం, జె.వెంకటకుమారి, ఎం.సూర్యనారాయణ, ఎస్.శ్రీను, పి.రామకృష్ణ, కె.రమణ, ఎస్.దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.


