నరసన్నపేట: మున్సిపాలిటీల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ కోరారు. గ్రేటర్ విశాఖ వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థి గా జిల్లా ఆడ పడుచు వరుదు కల్యాణి పోటీ చేస్తున్నారని, ఫ్యాన్ గుర్తుకు అత్యధికంగా ఓట్లు వేసి ఆమెను గెలిపించాలని విన్నవించారు. అలాగే జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాసలో వైఎస్సార్ సీపీ తరఫున మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థులుగా పిలక రాజలక్ష్మి, తాళాసు శ్రీపద్మలు పోటీ చేస్తున్నారని వారిని అధిక మెజారిటీతో గెలిపించాలని విన్నవించారు. కూటమి అన్ని వర్గాలను మోసం చేసిందని, ధరలు విపరీతంగా పెరిగాయని గుర్తు చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ వీడియో రిలీజ్ చేశారు.
వంశధార తగ్గుముఖం
హిరమండలం: వంశధార గొట్టా బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. గు రువారం ఉదయం నుంచి 48వేల క్యూసెక్కులకు పైగా వరదనీరు వచ్చి చేరింది. క్రమేపీ పెరుగుతూ రాత్రి 10 గంటలకు 78,721 క్యూ సెక్కుల రాగా శుక్రవారం నాటికి తగ్గుముఖం పట్టింది. రాత్రి 7 గంటలకు 64,294 క్యూ సెక్కులకు తగ్గింది.
ఓటీపీ లేకుండా గ్యాస్ పంపిణీ
శ్రీకాకుళం పాతబస్టాండ్: అర్నబ్ ప్రభావిత జిల్లాల్లో గృహ వినియోగదారులకు ఓటీపీ లేకుండానే గ్యాస్ పంపిణీ చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఓటీపీ లేకుండా నగదు చెల్లింపు ద్వారా నేరుగా సిలిండర్లను పొంది (కాష్–అండ్–కారీ) విధానాన్ని అమలు చేస్తామన్నారు. జిల్లాలోనూ ఈ వెసులుబాటు ఉంది.


