హామీలు
అభివృద్ధి
● అభివృద్ధికి ఆమడదూరంలో ఇచ్ఛాపురం మున్సిపాలిటీ
● అమలుకు నోచుకోని టీడీపీ వాగ్దానాలు
● ఎన్నికల వేళ మరోసారి చర్చనీయాంశం
ఫుల్..
ఇచ్ఛాపురం రూరల్: ఎన్నికలొస్తే హామీల వర్షం.. ఎన్నికలు ముగిశాక వాటి అమలుపై మౌనం! ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ గతంలో పుర ప్రజలకు ఇచ్చిన హామీలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. పట్టణ అభివృద్ధి, రైతుల సంక్షేమం, తాగునీటి సదుపాయాలు, పేదల ఇళ్ల పంపిణీ వంటి అంశాలపై ఇచ్చిన హామీల అమలు ఎంత వరకు వచ్చిందన్న ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
బాహుదానదిపై కొత్త వంతెన నిర్మాణం చేపట్టి పూర్తి చేస్తామని ఇచ్చిన హామీకి ఇప్పటికీ మోక్షం కలగలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కొత్త వంతెనకు తెచ్చిన జీవోను సదరు ఎమ్మెల్యే రద్దు చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. వంతెన నిర్మిస్తే రాకపోకలకు ఎంతో సౌకర్యం కలుగుతుందని ఆశించిన ప్రజలకు పనుల పురోగతిపై స్పష్టత కరువైంది.
బెల్లుపడ వద్ద గ్రోయిన్ నిర్మాణం చేపట్టి రైతులకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు ఈ నిర్మాణం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయినా ఈ హామీ కార్యరూపం దాల్చలేదు
అమృత్ 2.0 పథకం కింద సుమారు రూ.68 కోట్లతో మున్సిపాలిటీలో ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేసి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు పథకం పనుల పురోగతి, పూర్తయిన, మిగిలిన పనులపై అధికారులు స్పష్టమైన వివరాలు ఇవ్వలేకపోతున్నారు.
మున్సిపాలిటీలోని టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. సొంతింటి కల నెరవేరుతుందని ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు ఇళ్ల అప్పగింత ఎప్పుడు జరుగుతుందన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకంగా మారింది.
కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడుతో కలిసి ఇచ్ఛాపురం పట్టణంలోని పాతాళేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో రూ.3.8 కోట్లతో, నార్త్ కేబిన్ వద్ద రూ.2.6 కోట్లతో రైల్వే అండర్ పాస్ (ఆర్‌యూబీ) నిర్మాణాలకు శంకు స్థాపనలు జరిగి రెండు నెలలు కావస్తున్నా.. ఇంత వరకు పనులు మొదలు పెట్టలేదు. రూ.2,29 కోట్లతో రాజావారి మైదానంలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి భూమి పూజ జరిగినా ఇప్పటి వరకు పనులు ఊసే లేకుండా పోయింది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరోసారి గుర్తు చేసుకుంటున్న పట్టణ ప్రజలు వాటి అమలుపై సమాధానాలు కోరుతున్నారు. కొత్త హామీలు గుప్పించే ముందు గతంలో ప్రకటించిన అభివృద్ధి పనుల పరిస్థితిని ప్రజలకు వివరించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.


