ఇచ్ఛాపురం రూరల్: తేలుకుంచి గ్రామానికి ఏటా జూన్‌లో వచ్చే విదేశీ విహంగాలు ఈదు రుగాలులకు ఇబ్బంది పడ్డాయి. గూళ్లు నేలకొరగడంతో ఇప్పటికే సుమారు 60కి పైగా పక్షి పిల్లలు మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. గాయపడిన పక్షి పిల్లలను యువకులు చేరదీసి ఆశ్రయం కల్పిస్తున్నారు. అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో పశువైద్యాధికారి అందుబాటులో లేకపోవడంతో గాయపడిన పక్షులకు సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నాయని స్థానికులు వాపోతున్నారు.
శ్రీకాకుళం: నాగావళి నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయు డు కోరారు. ఆయన శుక్రవారం కునుకుపేట, కిల్లిపాలెం, కల్లేపల్లి, జాలారిపేట, పశుబంద, పెదగనగళ్లవానిపేట గ్రామాల్లో గల ముంపు ప్రాంతాలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఉద్యానవన, వరి పంటలు నష్టపోయిన వారికి నష్ట పరిహారం అందిస్తామన్నారు. పెద్ద గనగళ్లవానిపేట వద్ద సముద్ర తీర ప్రాంతం వద్ద నాగావళి, సముద్రం కలిసే ప్రాంతాన్ని పరిశీలించారు.
హిరమండలం: వంశధార గొట్టా బ్యారేజీని ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల చీఫ్ ఇంజినీర్ కె.శేషబాబు, వంశధార ఎస్‌ఈ రామచంద్రరావుతో కలసి శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. క్యాచ్‌మెంట్ ఏరియాలో వర్షపాతం నమోదు, బ్యారేజీలోని ఇన్‌ఫ్లో, నదిలోకి విడిచిపెట్టే అవుట్‌ఫ్లో వివరాలను వంశధార డీఈఈ సరస్వతిని అడిగి తెలుసుకున్నారు. వంశధార కుడి కాలువపై నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పనులు పరిశీలించారు.
నరసన్నపేట: స్థానిక పీఎం శ్రీ స్కూల్ ఆవరణలో శుక్రవారం గేటు ముందు వేప చెట్టు కూలిపోయింది. ఉర్లాం ప్రాథమిక పాఠశాల వద్ద కూడా టేకు చెట్టు ప్రహరీపై వంగింది. దీన్ని తొలగిస్తామని ఎంఈఓ–2 దాలినాయు డు తెలిపారు.


