పొన్నాడ లంక దిబ్బలో చిక్కుకున్న గొర్రెల కాపరులు
సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన రెస్క్యూ బృందం
శ్రీకాకుళం క్రైమ్ : ‘మా ప్రాణాలు పోయినా బాగుండేది. మూగ ప్రాణాలను వదిలేసి వచ్చాం.’ ఓ గొర్రెల కాపరి కంట నీరు పెట్టుకుంటూ చెప్పిన మాట ఇది. జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న పొన్నా డ వంతెన సమీపంలో నాగావళి నది గర్భంలో ఓ 15 ఎకరాల లంక దిబ్బ ఉంది. నదికి విపరీతంగా వరద వచ్చిన సంగతి తెలిసిందే. 2005 సంవత్సరం తర్వాత మళ్లీ ఇప్పుడే దిబ్బ చుట్టూరా నీరు చేరింది. కనుగులవాని పేటకు చెందిన చోడిమూడి నాగరాజు, కల్లేపల్లికి చెందిన బడగల వెంకటరావు, పొన్నాడకు చెందిన పల్ల అప్పారావు, పొందూరు మండలం కొంచాడకు చెందిన ఆవల గంగులు ఆ దిబ్బపైనే రెండు నెలలుగా 360 గొర్రెలు, 80 గొర్రె పిల్లలను మేపిస్తూ అక్కడే వంటావార్పు చేసుకుంటున్నారు. ఎవరో డ్రోన్ ఎగరేస్తే ఇక్కడ గొర్రెల కాపరులు, మూగజీవాలు ఉన్న విషయం తెలిసింది. ఉదయం 12.55కు ఫైర్ స్టేషన్‌కు కాల్ వెళ్లగా వా రు ఆపరేషన్ మొదలుపెట్టారు. దాదాపు రెండు గంటలు శ్రమించి 2.50 గంటలకు పాత పొన్నాడ గ్రామ భద్రమ్మ గుడి సమీప ఒడ్డుకు సురక్షితంగా చేర్చారు. తహసీల్దార్ గణపతిరావు పర్యవేక్షించారు.


