నిర్భయ్‌ ఫండ్‌తో మహిళలకు రక్షణ | - | Sakshi
Sakshi News home page

నిర్భయ్‌ ఫండ్‌తో మహిళలకు రక్షణ

Sep 20 2026 12:21 AM | Updated on Sep 20 2026 12:21 AM

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: నిర్భయ్‌ ఫండ్‌తో మహిళలకు రక్షణ, భద్రతా సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాను ఎంపిక చేసినట్లు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్‌తో కేంద్ర ప్రభుత్వ అధికారులు వర్చ్వుల్‌గా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళలకు పింక్‌ టాయిలెట్లు, సీసీ టీవిలు, క్రిటికల్‌ కేర్‌ యూనిట్లు, చార్జింగ్‌ స్టేషన్లు, చీకటి ప్రదేశంలో హైమాస్క్‌ లైట్లు, పోలీస్‌ శాఖ పానిక్‌ బటన్‌ సౌకర్యం, సెల్ఫ్‌ డిఫెన్స్‌ శిక్షణ కల్పిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ శ్రావణ్‌కుమార్‌, డీఎస్పీ వివేకానంద, డీటీసీ మణికుమార్‌, జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్‌ అప్పలనారాయణ, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి పి.శోభారాణి, డీసీహెచ్‌ఎస్‌ విజయలక్ష్మి, ఎంవీఐ ఆర్‌.అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

తీర పరిరక్షణ అందరి బాధ్యత

సోంపేట: సముద్రతీరాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అసిస్టెంట్‌ కలెక్టర్‌ హరి ఓం పాండ్య అన్నారు. అంతర్జాతీయ తీర ప్రాంత స్వచ్ఛత దినోత్సవం సందర్బంగా బారువ తీరంలో శనివారం మహా స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ సిబ్బంది, విద్యార్థులు, ట్రీ ఫౌండేషన్‌ ప్రతినిధులు, అధికారులతో కలిసి చెత్తాచెదారాలు తొలగించారు. కార్యక్రమంలో అటవీశాఖ డిప్యూటీ రేంజ్‌ అధికారి టి.దేవరాజు, మైరెన్‌ సీఐ రమేష్‌, ఎంపీడీఓ ఈశ్వరమ్మ, ట్రీ ఫౌండేషన్‌ ప్రతినిధులు సూరజ్‌ ప్రధాన్‌, కొండ సోమేశ్వరరావు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

శతాధిక వృద్ధురాలి మృతి

గార: బూరవెల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు మళ్ల సరస్వతమ్మ (105) శనివారం మృతి చెందారు. ఈ వయసులోనూ తన పనులు తానే చేసుకునేవారని, ముందు రోజు అస్వస్థతకు గురయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎంపీపీ గొండు రఘురామ్‌, పార్టీ సీఈసీ సభ్యుడు గొండు కృష్ణమూర్తి తదితరులు సరస్వతమ్మ భౌతికకాయానికి నివాళులర్పించారు.

ఆవిష్కార్‌ సీజన్‌–4 పోస్టర్‌ ఆవిష్కరణ

టెక్కలి : టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించనున్న ఆవిష్కార్‌ సీజన్‌–4కు సంబంధించి శనివారం పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్‌ వి.వి.నాగేశ్వరరావు మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సమాజానికి ఉపయోగపడేలా వినూత్నమైన ఆవిష్కరణలు రూపకల్పన కోసం ఆవిష్కార్‌ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ఎ.ఎస్‌.శ్రీనివాసరావు, ఐతం రైజ్‌ సీఈఓ బి.మనోజ్‌కుమార్‌, కన్వీనర్‌ జి.సతీష్‌కుమార్‌, కో–కన్వీనర్‌ పి.శిరీషా, శాక్‌ ఇన్‌చార్జి జె.సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

26న రెడ్‌ రన్‌

అరసవల్లి: హెచ్‌ఐవీపై అవగాహన కల్పించే క్రమంలో జిల్లా కేంద్రంలోని 80 ఫీట్‌ రోడ్డులో ఈ నెల 26న ఉదయం 5.30 గంటల నుంచి రెడ్‌ రన్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖాఽధికారి డాక్టర్‌ నరేష్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

మొదటి బహుమతిగా రూ.10 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.7 వేలు వంతున బహుమతులు అందిస్తామని ప్రకటించారు. ఆసక్తి గల యువకులు ఈ నెల 24లోగా 9494474206 నంబర్‌కు ఫోన్‌ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement