● యంత్రాలతో సచివాలయ నిర్మాణ పనులు ధ్వంసం
● యథేచ్ఛగా గ్రామకంఠం ఆక్రమణ
● మంత్రి పేరు చెప్పి దౌర్జన్యం
జలుమూరు: గొటివాడలో గ్రామ కంఠమైన సర్వే నంబర్ 69–3లో సుమారు 30 సెంట్లు భూమిని స్థానిక టీడీపీ నాయకులు దర్జాగా ఆక్రమించుకుంటున్నారు. జేసీబీ యంత్రాలతో స్థలాన్ని చదును చేస్తున్నారు. గత ప్రభుత్వంలో సుమారు రూ.1.50 కోట్లతో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ భవనాల కోసం పునాదులు, పిల్లర్లు వేసి పనులు కూడా ప్రారంభించారు. దీనికి సంబంధించి రూ.11 లక్షల బిల్లులను చెల్లించడంతో, రూ.22 లక్షల విలువైన మెటీరియల్ సమకూర్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ స్థలంపై టీడీపీ నాయకుల కన్నుపడింది. నీకింత నాకు కొంత అని వాటాలు వేసుకుని యంత్రాలతో వచ్చి పునాదులు తొలగించి ఆక్రమణలకు తెరలేపారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మెయ్యి శ్రీనివాసరావు కుటుంబ సభ్యుడు చైతన్య అనే వ్యక్తి మంత్రి అచ్చెన్నాయడు కార్యాలయంలో పనిచేయడంతో స్థానిక అధికారులు ఈ ఆక్రమణలకు అడ్డుచెప్పడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో లక్షలాది రూపాయలు ఖర్చు చేయడంతోపాటు ప్రస్తుత ఈ స్థలం కోర్టు వివాదంలో కూడా ఉందని గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు పల్లి రమణ చెబుతున్నారు. ఇందులో మరికొంత స్థలాన్ని స్థానిక టీడీపీ నాయకులు సోమినేని శ్రీనివాసరావు, నేతింటి రామారావు, ముద్ద రాజు, మెయ్యి దిలీప్ తదితరులు కూడా ఈ ఆక్రమణలో భాగస్వామ్యంగా ఉన్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేయనున్నామని రమణ తెలిపారు. రోడ్డును ఆనుకొని ఉన్న స్థలం కావడంతో రూ.కోట్లు విలువ చేయడంతో ఆక్రమణదారుల కన్నుపడింది.
ఈ విషయమై తహసీల్దార్ జెన్ని రామారావు వద్ద ప్రస్తావించగా ఆ స్థలంలో భవన నిర్మాణాలు ఉండటం వాస్తవమేనని చెప్పారు. అయితే అధికారులు ఇందులో జోక్యం చేసుకోకూడదని కోర్టు ఆర్డర్ ఇచ్చిందన్నారు. దీనిపై స్థానిక రెవెన్యూ సిబ్బందిని పంపి క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.


