అరసవల్లి: విద్యుత్‌పై పిడుగులు ప్రతాపం చూపాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటాక (తెల్లారితే శనివారం) 2 గంటల సమయం నుంచి సుమారు 5 గంటల సేపు జిల్లా కేంద్రంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. భారీగా ఉరుములు, పిడుగుల శబ్దాలు వినిపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. భారీ వర్షానికి తోడుగా పిడుగులు నేరుగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లపై పడటంతో ఎక్కడికక్కడ 10 వరకు ఇన్సులేటర్లు పేలిపోయాయి. అంపోలు– ఇండోర్ సబ్‌స్టేషన్ మధ్య 33 కేవీ ఫీడర్ లైన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనలతో శుక్రవారం అర్ధరాత్రి దాటాక.. విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో విద్యుత్ శాఖ ఎస్‌ఈ జీఎన్ ప్రసాద్, ఆపరేషన్స్ ఈఈ పైడి యోగేశ్వరరావుల ఆదేశాలు, సూచనల మేరకు డిప్యూటీ ఈఈ చల్లా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది వేకువజాము నుంచి యుద్ధప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. దీంతో 5 గంటల్లో కొత్త ఇన్సులేటర్లు ఏర్పాటు చేశారు. అరసవల్లి ఆదిత్యనగర్ కాలనీ పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు 33 కేవీ మెయిన్ లైన్‌లో కండక్టర్ల ఏర్పాటు పనులు చేపడుతున్న క్రమంలో శనివారం మధ్యాహ్నం కూడా సుమారు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. డిప్యూటీ ఈఈ చల్లా వెంకటేశ్వరరావు, లైన్ ఇన్‌స్పెక్టర్లు కాకర్ల శ్రీను, పాపారావులతో పాటు, లైన్‌మెన్లు, సిబ్బంది ఈ పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యారు.


