మేము విశాఖలో బస్సు ఎక్కాం. పలాస వెళ్తున్నాం. ఇంతలో జమ్ము వద్దకు వచ్చే సరికి బస్సు టైర్ పేలడం, మంటలు వ్యాపించడం అన్నీ కొన్ని నిమిషాల్లోనే జరిగి పోయాయి. వెంటనే సిబ్బంది కేకలు వేసి పరుగులు తీశారు. మేమూ కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నాం. – సుభావతి, టెక్కలి
నరసన్నపేట : మొదట టైరు పేలిన శబ్దం.. అది పరిశీలిస్తుండగా ఎయిర్ సిలిండర్ పేలిన చప్పుడు.. కమ్మేసిన పొగలు.. అంతా దిగి చూసే సరికే వ్యాపించిన మంటలు. జమ్ము కూడలి వద్ద శనివారం ఉదయం జరిగిన ప్రైవేటు బస్సు ప్రమాదం తీరు ఇది. ప్రయాణికులంతా సురక్షితంగా దిగిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నడిరోడ్డుపై కేవీఆర్ ట్రావెల్స్ బస్సు అలా కాలిపోవడం మాత్రం విస్మయం గొలిపింది.


