కారు కదిలింది
కస్పా అప్పన పట్నాయక్ అనే వ్యక్తి స్థలంలో పార్క్ చేసిన కారు ఇది. అప్పన్న బతికున్నప్పుడు గోవిందరావు అనే వ్యక్తి కారు పార్కింగ్ చేసి, రోజుల గడుస్తున్నా తీయకుండా మొండికేసి, ఏం చేస్తావో చూస్తామన్నట్టుగా వ్యవహరించారు.
టీడీపీ బ్యాచ్ ఆగడాలకు కలత చెంది అప్పన పట్నాయక్ మృతి చెందిన తర్వాత ఆయన స్థలంలో ఉన్న ఫలంగా ఎన్నో రోజులుగా పార్కింగ్ చేసిన కారును తీసేసిన దృశ్యమిది. ఆయన బతికున్నంతకాలం ఆ కారు తీసేందుకు ఏ ఒక్కరూ ప్రయత్నించలేదు. చివరికి పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు. ఆయన మరణించాక మాత్రం ఆగమేఘాల మీద కారు తీసేసి తప్పు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
పోలీసులకు ఫిర్యాదు.. కలెక్టర్‌కు ఫిర్యాదు.. ప్రాణం పోయేంతలా వేధింపు.. ఆఖరికి ప్రాణాలే కోల్పోయిన వైనం. జిల్లా కేంద్రంలోని కబ్జా భయం, ఓ కారు పార్కింగ్ ఘటన పాలకుల నిరంకుశ వైఖరికి నిలువెత్తు నిదర్శనంలా మారింది. జిల్లా కేంద్రానికి చెందిన అప్పన పట్నాయక్ తన స్థలం కబ్జా పాలవుతోందని భయపడ్డారు. తన స్థలంలో కారు పార్క్ చేశారని ఫిర్యాదు చేస్తే అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు వచ్చి ఆ స్థలంలో హడావుడి చేశారు. ఫిర్యాదులు చేస్తే బాగుండదని బెదిరించారు. ఎవరో వచ్చి తన స్థలంపై అజమాయిషీ చేస్తుంటే చూసి ఆయన తట్టుకోలేకపోయేవారు. కుటుంబీకులు పోలీసు స్టేషన్‌కు వెళ్తే అక్కడ కూడా టీడీపీ అరాచక బ్యాచ్ హడలెత్తించింది. ఇంకేముంది ఆ వృద్ధుడు కలత చెంది మృతి చెందారు. ఆ స్థలంలో కొన్ని రోజులుగా వివాదాస్పదంగా పార్కింగ్ చేసిన కారును వృద్ధుడు మరణించాక ఆగమేఘాల మీద తీసేశారు.
ఒక ఫిర్యాదు వస్తే పార్కింగ్ చేసిన వివాదాస్పద కారును కూడా తీయలేని స్థితిలో పోలీసులు ఉన్నారా? లేదంటే కారు తీయకుండా ఉండటానికి పోలీసులపై ఆ స్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయా? అన్నది నగరమంతా చర్చ జరుగుతోంది. పక్కా డాక్యుమెంట్స్ ఉన్న కస్పా అప్పన పట్నాయక్ స్థలంలోకి దొండపాటి నవీన్ తదితర టీడీపీ బ్యాచ్ వచ్చి హల్‌చల్ చేయడమేంటి? తన స్థలంలో పార్కింగ్ చేసిన కారును తీయాలని కోరుతూ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే.. అక్కడ పోలీసుల ముందే అప్పన పట్నాయక్ కుటుంబ సభ్యులపై అంతెత్తున లేవడమేంటి? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ప్రతిపక్ష నాయకులపై ఎవరో ఇచ్చే తప్పుడు ఫిర్యాదులు, సంబంధం లేని కేసుల్లో ఏకంగా అరెస్టులు చేసే పోలీసు అధికారులు సాక్షాత్తూ ఒక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాది దారులపై టీడీపీ బ్యాచ్ దౌర్జన్యకర రీతిలో ప్రవర్తిస్తే వారి జోలికి వెళ్లకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు స్టేషన్‌లో సీసీ పుటేజీలు చూస్తే ఆ టీడీపీ బ్యాచ్ బండారం బయటపడుతుంది. కస్పా అప్పన పట్నాయక్ స్థలంలో టీడీపీ నాయకులు చేసిన హడావుడిపై విచారణ జరిపితే వాస్తవాలు బయటికొస్తాయని స్థానికులు కోరుతున్నారు. కానీ అవేమీ చేయకుండా బాఽధితుడైన వృద్ధుడు మరణించాక ఫిర్యాదులో పేర్కొన్న కారును తీసి, అంతటితో చేతులు దులుపుకోవడం తగదని అంటున్నారు.
కబ్జా స్థలంలో కారు తీయమని కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదు
అక్రమంగా పార్క్ చేసిన కారును తీయాలని అభ్యర్థించిన వృద్ధుడు
బతికుండగా జరగని న్యాయం
మరణించాక హుటాహుటిన కారు తీసేసిన వైనం
టీడీపీ అరాచక బ్యాచ్‌పై కానరాని చర్యలు


