పొలాల్లో దొంగలుపడ్డారు! | - | Sakshi
Sakshi News home page

పొలాల్లో దొంగలుపడ్డారు!

Sep 11 2026 11:03 AM | Updated on Sep 11 2026 11:03 AM

పొలాల్లో దొంగలుపడ్డారు! వేల రూపాయల లాభం.. రైతులకు కష్టాలు..

జిల్లాలో వరుసగా విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీలు ఒక్క ఎల్‌ఎన్‌పేట మండలంలోనే తొమ్మిది ఘటనలు విలువైన రాగి వైరు కోసమే దొంగతనాలు నియంత్రించలేకపోతున్న పోలీసులు ఆందోళనలో రైతులు

ఈ నెల 8న ఎల్‌ఎన్‌పేట మండలం

కోతిగార్లపాడులో పొలాల్లో ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీకి గురైంది. అర్ధరాత్రి ట్రాన్స్‌ఫార్మర్‌ వైర్లను తొలగించి అందులో ఉన్న విలువైన రాగిని దోచుకుపోయారు. ఉదయం రైతులు గమనించి అధికారులకు సమాచారం అందించారు.

ఈ నెల 7న ఎల్‌ఎన్‌పేట మండలం

ఎస్‌కే బాలేరు గిరిజన గ్రామంలో పొలంలో ఉన్న రెండు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను చోరీ చేశారు. వైర్లు కట్‌చేసి ట్రాన్స్‌ఫార్మర్‌ను

కిందకు దించారు. అందులో ఉన్న రాగిని దోచుకుపోయారు. రైతులు గమనించి

అధికారులకు సమాచారం అందించారు.

హిరమండలం:

జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. ఒక్క ఎల్‌ఎన్‌పేట మండలంలోనే గడిచిన రెండు నెలల కాలంలో తొమ్మిది ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. విద్యుత్‌ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడమే తప్ప.. నిందితుల అరెస్టు త్వరితగతిన జరగడం లేదు. ఒక్క ఎల్‌ఎన్‌పేట మండలంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా ఈ ఘటనలు జరుగుతునే ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో జలుమూరు మండలం లింగాలవలస ఎత్తిపోతల పథకానికి సంబంధించి భారీ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీకి గురైంది. అందులో 480 కిలోల రాగి వైరు పట్టుకుపోయారు. దాని విలువ రూ.5.70 లక్షలు ఉంటుందని అంచనా. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీ ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో కోటబొమ్మాళి పోలీసులు ఆరుగుర్ని అరెస్టు చేసి వారి వద్ద సుమారు రూ.8 లక్షలు విలువైన రాగి వైరును అప్పట్లో స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల వరుస ఘటనలతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అంతర్‌ రాష్ట్ర ముఠా పనే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఒక్క ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీ చేస్తే వేల రూపాయలు సొంతం చేసుకోవచ్చనే ఆలోచనతో దుండగులు ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. కొత్తగా ఏర్పాటుచేస్తున్న సోలార్‌ ప్యానళ్లలో సైతం రాగి చోరీకి గురవుతుందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే దొంగలు ఎక్కువగా పాత ట్రాన్స్‌ఫార్మర్లను టార్గెట్‌ చేస్తుండటం గమనార్హం. అందులో 10 నంచి 22 కిలోల వరకూ రాగి ఉంటుంది. మార్కెట్‌లో రాగి వైరు కిలో రూ.1500 నుంచి రూ. 2000 వరకూ పలుకుతోంది. ఒక ట్రాన్స్‌ఫార్మర్‌ను కొల్లగొడితే రూ.20 వేలకు పైగా సమకూరుతుండడంతో దొంగలు చోరీబాట ఎంచుకుంటున్నారు. సాధారణంగా ఊరుకు దూరంగా ఉన్న పొలాల్లో ఎక్కువగా ట్రాన్స్‌ఫార్మర్లు ఉంటాయి. రాత్రికి రైతుల తాకిడి ఉండని వాటినే టార్గెట్‌ చేసుకుంటున్నారు. ఇలా చోరీ చేసిన రాగిని బరంపూర్‌, జైపూర్‌ వంటి ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నట్లు సమాచారం.

జిల్లాలో తీవ్ర వర్షాభావం నెలకొంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేశాయి. ఈ నేపథ్యంలో రైతులు పంపుసెట్లపై ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురవుతుండడంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. కొత్త వాటిని అమర్చడంలో జాప్యం జరుగుతోంది. ఒక్క ఎల్‌ఎన్‌పేట మండలంలోనే ఏకంగా తొమ్మిది ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురికావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నా వారు తగిన విధంగా పట్టించుకోవడం లేదన్న విమర్శ ఉంది. వరుసగా చోరీలు జరుగుతున్నాయి. పోలీసుల నిఘా ఉందన్న భయం కూడా ఆగంతకులకు లేకుండాపోతోంది. ఇప్పటికై నా పోలీస్‌ శాఖ పటిష్ట చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement