ఇచ్ఛాపురం విద్యాశాఖ కార్యాలయం వద్ద అసాంఘిక కార్యకలాపాలు మహిళా ఉపాధ్యాయులు రావాలంటే జంకుతున్న వైనం పోలీసులకు ఫిర్యాదు చేసినా మారని పరిస్థితి
చీకటి పడితే చాలు..
ఇచ్ఛాపురం రూరల్: స్థానిక విద్యా వనరుల కేంద్రం(ఎమ్మార్సీ) అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. చీకటి పడితే చాలు ఇక్కడ మందుబాబులు గుమిగూడుతున్నారు. కార్యాలయం పక్కనే నిరుపయోగంగా ఉన్న గదుల్లో కొందరు యువకులు సిగరెట్లు, గంజాయి సేవిస్తున్నారని స్థానికులు, ఉపాధ్యాయులు చెబుతున్నారు. మద్యం, గంజాయి మత్తులో అసభ్యంగా మాట్లాడటం, గొడవలకు దిగడం వంటి ఘటనలతో పరిసరాల్లోని వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ పరిసరాల్లోని పాన్‌షాపుల్లోనూ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యావనరుల కేంద్రం(ఎమ్మార్సీ)కు విద్యాశాఖ సమావేశాలు, బోధన శిక్షణ, వివిధ పనుల నిమిత్తం వచ్చే మహిళా ఉపాధ్యాయులకు ఎమ్మార్సీ పరిధిలో ఖాళీ మద్యం సీసాలు, సిగరెట్ పీలికలు చూసి ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై గతంలో పూర్వ మండల విద్యాశాఖాధికారి కురమాన అప్పారావు పోలీస్, ఎకై ్సజ్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించలేదు.


