శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళ రంగస్థల కళాకారుల సమాఖ్య నెలవారీ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో 323వ నెలవారీ కార్యక్రమంలో భాగంగా జానపద దినోత్సవం శనివారం బాపూజీ కళామందిర్‌లో నిర్వహించారు. సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ ఎల్.రామలింగస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా జానపద కళాకారుల సంఘం అధ్యక్షుడు కలగ గణేష్ యాదవ్, గిడుగు రామమూర్తి తెలుగు భాషా జానపద కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు బద్రి కూర్మారావు, శ్రీకాకుళం సీనియర్ న్యాయవాది శ్రీ ఆరంగి లక్ష్మీపతి, సినీ నటులు మద్ది సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జానపద కళలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, వాటిని భావితరాలకు అందించేందుకు కళాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. కళారంగానికి సమాఖ్య అందిస్తున్న సేవలను అభినందించారు. అలాగే సమాఖ్య కార్యక్రమాలకు ప్రతి నెలా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ కళాకారులను ప్రోత్సహించిన ముట్నూరు కామేశం చనిపోవడంతో ఆయన కోసం మౌనం పాటించారు. అనంతరం జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు కలగ గణేష్ యాదవ్‌ను సత్కరించారు. బోనెల అసిరయ్య జముకుల పాటను ప్రదర్శించగా, చిన్న తుంబయ్యపేటకు చెందిన గొర్రెల మల్లేశ్వరరావు బృందం ఎరుకల పాటను ప్రదర్శించింది. ఎస్.ఎం. పురానికి చెందిన కోరాడ సత్తిబాబు బృందం తప్పెటగుళ్ల విన్యాసం, పెద్దపాడుకు చెందిన సవలాపురపు పాపారావు బృందం డప్పు విన్యాసాన్ని ప్రదర్శించారు.


