శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): కొవ్వాడ అణువిద్యుత్ పార్కును రద్దు చేయాలని ఆంధ్ర ఇంటెలెక్చువల్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు ప్రొఫెసర్ జి.అప్పలనాయుడు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చాపర సుందరలాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సనపల అన్నాజీరావు డిమాండ్ చేశారు. శనివారం ఫోరం ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో ఎన్జీఓ హోమ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుజరాత్ రాష్ట్రం మితివిర్దిలో పెట్టాల్సిన అణువిద్యుత్ కేంద్రాన్ని అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తే బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి కొవ్వాడకు తరలించారని విమర్శించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల గాని, మానవ తప్పిదం వల్ల గాని, యంత్ర లోపం గాని ఏ చిన్న ప్రమాదం జరిగినా ఇటు కాకినాడ నుంచి అటు ఒడిశా ఛత్రపూర్ వరకూ నాశనం అవుతుందన్నారు. అభివృద్ధి చెందిన అమెరికా, జర్మనీ, జపాన్ లాంటి సాంకేతిక పరిజ్ఞానం గల దేశాలు అణువిద్యుత్ కేంద్రాలను మూసివేస్తున్నారని గుర్తు చేశారు. అణు కార్మాగారాలు కాకుండా యువత ఆత్మగౌరవంతో జీవించే ఉపాధి కావాలన్నారు. కొవ్వాడలో అణుపార్క్‌ను పెట్టడమంటే ఉత్తరాంధ్రలో అణుబాంబు పెట్టడమేనని అన్నారు. అణువిద్యుత్ కేంద్రాన్ని రద్దు చేసి రైతుల తీసుకున్న భూములు తిరిగి రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్గో ఎయిర్ పోర్ట్, బీచ్ శాండ్ తవ్వడానికి అనుమతులు ఇవ్వడం తగదన్నారు. మత్సకారులకు ఉపాధి కల్పించడానికి ఒక్క జెట్టి గానీ, ఫిషింగ్ హార్బర్ గానీ కట్టలేదన్నారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు గాలి మాటలు తప్ప శ్రీకాకుళం జిల్లాకు చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. సమావేశంలో ఫోరం ప్రతినిధులు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.అమ్మన్నాయుడు, మత్స్యకారుల సంఘం నాయకులు చింతపల్లి సూర్యనారాయణ, కొమర మున్నా, కొవ్వాడ గ్రామస్తులు మైలపల్లి పోలీస్, మైలపల్లి శివకుమార్, కాంగ్రెస్ నాయకులు ఎం.నరసింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు.


