ఘరానా వాదన | - | Sakshi
Sakshi News home page

ఘరానా వాదన

Sep 4 2026 1:54 AM | Updated on Sep 4 2026 1:54 AM

అరసవల్లి:

జెడ్పీ స్థాయీ సంఘ సమావేశం మాటల యుద్దంతో భగ్గుమంది. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్‌ వ్యవహార శైలితో ఈ సమావేశాల ‘స్థాయి’ తగ్గినట్టైంది. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో గురువారం జెడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ అధ్యక్షతన జరిగిన స్థాయీ సంఘ సమావేశాల్లో ఎమ్మెల్యే తన స్థాయిని మర్చిపోయి జెడ్పీటీసీలపై ఏకవచన పద ప్రయోగం చేశారు. జెడ్పీటీసీలు ధర్మాన కృష్ణచైతన్య, సురవరపు నాగేశ్వరరావులపై దాదాపుగా భౌతిక దాడికి సిద్ధమయ్యేలా వ్యవహరించారు. కూటమి రెండేళ్ల పాలనపై జెడ్పీటీసీలు విమర్శలు ఎక్కు పెట్టడంతో ఎమ్మెల్యే కూన నోటికి పని చెప్పారు. దీంతో కేవలం నాలుగు శాఖల ప్రగ తి సమీక్షలతోనే సమావేశం ముగించాల్సి వచ్చింది. సమావేశంలో జెడ్పీ సీఈఓ ఆర్‌.వెంకట్రామన్‌ తదితర జిల్లా స్థాయీ అధికారులు పాల్గొన్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే.

కలెక్టర్‌ చెప్పినా చెయ్యరా..

పోలాకి మండలంలో జెడ్పీ నిధులతో పలు గ్రా మాల్లో చేసేందుకు ఈ ఏడాది జూన్‌ 30న ఆదేశాలు వచ్చినప్పటికీ నేటికీ ఒక్క పని మొదలు పెట్టకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని, దీనిపై జిల్లా కలెక్టర్‌ కూడా చెప్పినప్పటికీ అధికారులు పనిచెయ్య డం లేదని పోలాకి జెడ్పీటీసీ కృష్ణచైతన్య అన్నారు. దీనిపై డీపీఓ స్వరూపారాణి మాట్లాడుతూ తమకు గత మూడు రోజుల కిందటే ఈ పనుల కోసం సమాచారం వచ్చిందని, వాస్తవానికి ఈ పనులకు గ్రామ తీర్మానాలు అవసరమని, అవ్వగానే పనులు చేసుకోవచ్చునని బదులిచ్చారు. జెడ్పీ నిధులతో చేయాల్సిన పనులకు ఇలాంటి అడ్డంకులేంటని జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ పిరియా విజయ కూడా ప్రశ్నించారు. దీనిపై ఆమదాలవలస ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ జోక్యం చేసుకుంటూ.. అనవసర రాజకీయాలు మాట్లాడొద్దని, జెడ్పీ నిధులతో పనులెక్కడా తాము గానీ తమ పార్టీ నేతలు గానీ ఆపడం లేదన్నారు. దీనిపై సరుబుజ్జిలి జెడ్పీటీసీ నాగేశ్వరరావు స్పందిస్తూ ‘మీరు కూడా ఆమదాలవలస నియోజకవర్గంలో పనులు అడ్డుకుంటున్నారు కదా..’ అంటూ బదులిచ్చారు. దీంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే రవి ఊగిపోతూ ‘నీకు అవగాహన తక్కువ.. ప్రేలాపన ఎక్కువ’ అంటూ ఏకవచన ప్రయోగం చేశారు. ఉపాధి హామీ పథకం నిధులతో చేయాల్సిన పనులకు జెడ్పీ నిధులతో చేయొద్దని అన్నారు. అయితే నరసన్నపేట నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఈ విషయాల్లో అవగాహన లేదని అర్థమైందని, త్వరలో అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటివి జరగకుండా క్లాస్‌ తీసుకుంటానన్నారు.

పింఛన్లపై రభస

సమావేశంలో పింఛన్ల ప్రస్తావన రావడంతో ఒక్కసారిగా సమావేశం వేడెక్కింది. వైఎస్సార్‌ సీపీ గ తంలో లక్షలాది పింఛన్లు తొలగించేసిందని ఎమ్మెల్యే కూన రవి ప్రస్తావించగా వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీలు కృష్ణచైతన్య, నాగేశ్వరరావు, దువ్వాడ వాణి, పాల వసంతరావు, దుబ్బ వెంకట రమణ, టొంపల సీతారాం తదితరులు ఎమ్మెల్యేపై ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన పింఛన్లు ఎన్నో చెప్పాలని పట్టుబట్టారు. 50 ఏళ్లు దాటిన వారికి పింఛను హామీ ఏమైందని కృష్ణచైతన్య గుర్తుచేశారు. అలాగే తమ నియోజవర్గంలో అన్యాయంగా పింఛన్‌ నిలిపివేసినందుకు బాధితుడు కోర్టును ఆశ్రయిస్తే పింఛన్‌ ఇచ్చారని గుర్తుచేశారు. దీనిపై ఎమ్మెల్యే రవి మాట్లాడుతూ పింఛన్లపై రాద్ధాంతం చెయ్యొద్దని, జగన్‌ రూ.3 వేల చొప్పున మూడు నెలలే పింఛను ఇచ్చారని ఎద్దేవా చేశారు. అలాగే తమ ప్రభుత్వం వచ్చాక ఇంతవరకు స్పౌజ్‌ మాత్ర మే ఇచ్చామని, త్వరలో కొత్త పింఛన్లు ఇస్తామని ప్రకటించారు.

జెడ్పీటీసీలకు మాట్లాడే అవకాశమివ్వరా..?

స్థాయీ సంఘ సమావేశాల్లో జెడ్పీటీసీలకు మాట్లాడే అవకాశాలు ఇవ్వకుండా ఎంతసేపు ఎమ్మెల్యే రవికుమార్‌ మాత్రమే మాట్లాడి అధికారులను బెదిరించేస్తే సరిపోతుందా మా సమస్యలు చెప్పనివ్వరా.. ఇదే ఆఖరి స్థాయీ సంఘ సమావేశం, ఇందులో కూడా మాకు కనీసం మాట్లాడనివ్వరా.. అంటూ పలువురు జెడ్పీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎమ్మెల్యే రవికుమార్‌ జోక్యం చేసుకుంటూ తాను కూడా సభ్యుడినేనని, తనకు కూడా మాట్లాడే హక్కు ఉందని, మీరంతా ఆఫ్‌ట్రాల్‌ జెడ్పీటీసీలని, తాను ఎక్కడైనా మాట్లాడగలనని గట్టిగా వాదనకు దిగారు. దీనిపై టెక్కలి జెడ్పీటిసీ దువ్వాడ వాణి స్పందిస్తూ రవికుమార్‌కు మాట్లాడటానికి అవకాశం ఇవ్వొద్దని జెడ్పీ చైర్‌పర్సన్‌ విజయకు కోరారు. జెడ్పీటీసీలకు మాట్లాడకుండా అవకాశాలు ఇవ్వకపోతే ఎలా జెడ్పీటీసీల కోరం ఉంటేనే సభ జరుగుతుందనే విషయాన్ని మరిచిపోవద్దని మండిపడ్డారు. అనంతరం జెడ్పీటీసీలు ధర్మాన కృష్ణ చైతన్య, దువ్వాడ వాణి, దుబ్బ వెంకటరమణ, పాల వసంతరావు, నాగేశ్వరరావు తదితరులంతా సమావేశం ముగియకుండానే వెళ్లిపోయారు.

జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో మాటల యుద్ధం

జెడ్పీటీసీ సభ్యులపై ఏకవచన ప్రయోగాలతో నోరుపారేసుకున్న ఎమ్మెల్యే కూన రవి

పోలాకి జెడ్పీటీసీ ధర్మాన కృష్ణచైతన్యపై విరుచుకుపడిన ఎమ్మెల్యే రవి

నరసన్నపేటలో పోటీ చేస్తా నీ సంగతి చూస్తానంటూ బెదింపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement