స్థాయీ సంఘ సమావేశాల వేదికలో ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్, జెడ్పీటీసీలపై విరుచుకుపడ్డారు. ముందుగా సరుబుజ్జిలి జెడ్పీటీసీ నాగేశ్వరరావుపై పనుల అడ్డగింత అంశంలో ధ్వజమెత్తుతూ ‘నాగేశ్వరరావు.. జాగ్రత్త. సంగతి చూస్తా..’ అంటూ మీసం మెలేశారు. అనంతరం పింఛన్ల అంశంలో పోలాకి జెడ్పీటీసీ ధర్మాన కృష్ణచైతన్యపై తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. ‘చైతన్య.. నువ్వు రెచ్చిపోతున్నావ్. నా సంగతి తెలియదు. మీ నాన్న, చిన్నాన్నలకే లెక్కచెయ్యను నేను. నువ్వెంత. నీకు అంత కోరికుంటే నేనే నరసన్నపేటలో పోటీ చేస్తా.. అప్పుడు నీ సంగతి తేల్చుతా.’ అంటూ రవి కుమార్ ఊగిపోయారు. దీనిపై కృష్ణ చైతన్య మాట్లాడుతూ ‘రండి.. నరసన్నపేటలో సర్పంచ్ స్థాయి వారిని మీపై నిలబెట్టి గెలిపించి మా దమ్ము ఏంటో చూపిస్తాం’ అంటూ సమాధానమిచ్చారు. వాదన ముదరడంతో జెడ్పీ చైర్‌పర్సన్ విజయ ఆదేశాలతో మైక్ కట్ చేయించారు.


