● ప్రభుత్వంపై నిరసన జ్వాల
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఉద్యోగులు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ఉద్యోగులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛన్‌దారుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులు కదం తొక్కారు. ప్ర భుత్వ తీరును ఎండగడుతూ సోమవారం జిల్లా కేంద్రంలో నినాదాలు చేసి నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పీజీఆర్‌ఎస్‌లో వినతి పత్రం అందజేశారు. ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర సద స్సులో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా సోమవారం పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో కలెక్టర్‌ని కలిసి, రేపటి నుంచి జరగబోయే ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన వివరాలతో కూడిన నోటీసును అందజేశారు. ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లుపై వస్తున్న ఆరోపణలను ఖండించారు.
రాష్ట్ర ఉద్యమ కమిటీ ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ షెడ్యూల్‌ను జిల్లా, డివిజన్, మండల, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ స్థాయిలో తప్పనిసరిగా పాటిస్తూ పోరాటాన్ని కొనసాగించాలని కోరారు.
కార్యక్రమంలో ఏపీజేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ భైరి రాజు, ప్రధాన కార్యదర్శి ఎస్‌వీ రమణ, మహిళా విభాగం చైర్మన్ కె.ప్రవల్లిక ప్రియ, ప్రధాన కార్యదర్శి జి.అరుణ కుమారి పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


