● నా కుటుంబ విషయాల్లో ఎమ్మెల్యే జోక్యం
● పీజీఆర్‌ఎస్‌లో మహిళ ఫిర్యాదు
శ్రీకాకుళం: శ్రీకాకుళం నగరంలోని గార వీధిలో తన పేరిట ఉన్న ఆస్తి హక్కుతో కూడిన మున్సిపల్ ట్యాక్స్‌ను మార్చేందుకు తన కుమారులు ప్రయత్నిస్తున్నారని, ఇందుకు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ పురపాలక అధికారులకు సూచనలు ఇస్తున్నారని పొలుమూరు మీనాక్షి అనే మహిళ సోమవారం పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం నగరంలోని గార వీధిలో సర్వే నంబర్లు 1242 లేదా 1240కు సంబంధించి ఆస్తి తన పేరిట ఉందని, మున్సిపల్ ట్యా క్స్‌ను కూడా తానే చెల్లిస్తున్నానని ఆమె తెలిపారు. ఈ ఆస్తిని తన కుమార్తె లక్ష్మికి పసుపు కుంకాల కింద ఇచ్చానని, ప్రస్తుతం తన కుమార్తే ఆదుకుంటోందని ఆమె వివరించారు. కానీ ఈ ఆస్తిని తన కుమారులైన పొలుమూరు ఈశ్వరరావు, పొలుమూరు సింహాచలం తీసుకోవాలని చూస్తున్నారని, దీని కోసం ఎమ్మెల్యే వద్దకు వెళ్లారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యేకి బేరం పెట్టుకొని, ప్యాకేజీ మాట్లాడుకున్నారని మీనాక్షి ఫిర్యాదులో పేర్కొన్నారు. మున్సిపల్ ట్యాక్స్‌లో పేరును చనిపోయిన తన భర్త పేరు మీద గానీ, కుమారుల పేరు మీద గానీ మార్చాలని చూస్తున్నారని తన దృష్టికి వచ్చిందని, దీనిపై చర్య లు తీసుకోవాలని ఆమె వినతి అందించారు. ఎమ్మెల్యే కుటుంబ విషయాల్లో తలదూర్చుతు న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


