పలు వినతులు పరిశీలిస్తే...
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
● పీజీఆర్‌ఎస్‌లో 163 వినతులు స్వీకరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: క్యూఅర్ కోడ్‌ను ఉపయోగించుకొని అర్జీదారులు పెట్టుకున్న అర్జీ పరిష్కారానికి సంబంధించిన స్పందన (ఫీడ్‌బ్యాక్) తెలియజేయవచ్చని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికను జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలోని గ్రీవెన్స్ కేంద్రాల వద్ద ప్రజాభిప్రాయ సేకరణ కోసం క్యూఆర్ కోడ్‌ను తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేసేందుకు అర్జీదారులను ప్రోత్సహించాలని సూచించారు. అర్జీలు సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌కు వచ్చే ప్రతి వ్యక్తి ఇచ్చిన అర్జీని రిజిస్ట్రేషన్ చేయాలని, వారికి రశీదు ఇవ్వాలని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్‌కు నిరాకరిస్తే చర్యలు తీసుకుంటామని సిబ్బందికి హెచ్చరించారు. ఈ వారం 163 అర్జీలు స్వీకరించగా.. ఇందులో రెవెన్యూ 63, పంచాయతీ రాజ్ 14, పట్టణ, పరిపాలన శాఖ 12, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ 11, గృహ నిర్మాణ శాఖ 7, సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ 6, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ 5, స్కిల్ డవలప్‌మెంట్ 5, హోంశాఖ 5, వాటర్ రిసోర్స్ ఈఎన్సీ 4, ఏపీ ఈపీడీసీఎల్ 4, స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డు 4, గ్రామీణ నీటి సరఫరా 3, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 2, గ్రామీణాభివృద్ధి 2, విద్యాశాఖ 2, ఏపీఎస్ ఆర్టీసీ 2, సమగ్ర శిక్ష 2, హార్టికల్చర్, దేవదాయ శాఖ, కుటుంబ సంక్షేమం, ఏపీ స్టేట్ ఇరిగేషన్ డవలప్‌మెంట్ కార్పొరేషన్, బీసీ సంక్షేమం, మెడికల్ ఎడ్యుకేషన్, మైన్స్ అండ్ జియాలజీ, సీ్త్ర, శిశు సంక్షేమం తదితర శాఖలకు సంబంధించి ఒక్కటి చొప్పున అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్య, డిప్యూటీ కలెక్టర్ జి.జయదేవి, ఆర్డీవో కె.సాయి ప్రత్యూష, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
● ఇసుక ర్యాంపు నిలిపివేయాలి
గార మండలం శాలిహుండం వద్ద వంశధార నదిపై గల ఇసుక ర్యాంపుని నిలిపి వేయాలని ఆ గ్రామానికి చెందిన రైతులు, ప్రజలు పీజీఆర్‌ఎస్‌లో వినతిని అందజేశారు. గతంలో ఇసుక ర్యాంపు వద్దని, బోరు బావులకు నీటి ఇబ్బంది వస్తోందని తెలియజేయడం జరిగిందన్నారు. ఇసుక ర్యాంప్ వలన బోరు బావులకు నీరురాక పంటలు పండించుకోవడం కష్టంగా మారిందని వాపోయారు. అలాగే గార గ్రామానికి తాగునీరు కూడా సమస్యగా మారుతోందని తెలిపారు. అక్రమ ఇసుక తవ్వకాల కోసం కొత్తగా సీసీ రోడ్డును వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో చింతల గడ్డెయ్య, బి.రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
● ప్రతిపాదన ఆపాలి
నరసన్నపేట నియోజకవర్గం జలుమూరు మండలం లింగాలవలస గ్రామ పంచాయతీ పరిధిలోని తమ ఓట్లను దరివాడ గ్రామ పంచాయతీలోకి మార్చే ప్రతిపాదనను తక్షణమే నిలిపివేయాలని లింగాలవలస గ్రామస్తులు కోరారు. గత 50 ఏళ్లుగా తాము లింగాలవలస గ్రామ పంచాయతీ పరిధిలోనే ఓటు హక్కును వినియోగించుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం రాజకీయ ప్రయోజనాల కోసం తమ గ్రామంలోని ఓటర్లను దరివాడ గ్రామ పంచాయతీ పరిధిలోకి మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వాపోయారు. ఈ రెండు గ్రామాల మధ్య సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఉందని పేర్కొన్నారు. ఓటర్లను దరివాడకు మార్చడం వల్ల వృద్ధులు, మహిళలు, సాధారణ ఓటర్లు ఎన్నికల సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు.
దోబీఖానా పునరుద్ధరించాలి
పాత శ్రీకాకుళం సంతోషిమాత ఆలయం ఽసమీపంలో నివసిస్తున్న సుమారు 30 రజకుల కుటుంబాలకు అక్కడ ఎప్పటినుంచో ఉన్న దోబీఖానాను పునరుద్ధరించాలని రజక కులస్తులు కోరారు. చెరువు పక్కనున్న దోబీ ఖానాలు శిథిలావస్థకు చేరుకున్నాయని తెలిపారు. అలాగే చెరువులో ఆక్రమణలు తొలగించాలని విన్నవించారు.


