టెండర్లకు మోక్షమెన్నడో..! | - | Sakshi
Sakshi News home page

టెండర్లకు మోక్షమెన్నడో..!

Sep 1 2026 3:18 AM | Updated on Sep 1 2026 3:18 AM

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలకు కూరగాయలు, పండ్లు, మాసం తదితర సామగ్రి అందించేందుకు వేసిన టెండర్లకు మూడు నెలలు గడుస్తున్నా ఇంకా మోక్షం కలగడం లేదు. ఈ టెండర్లు సజావుగా నిర్వహించేందుకు రాజకీయాలు అడ్డుతగులుతున్నాయి. ప్రతిఏటా జూన్‌ నెలలో విద్యాసంస్థలు ప్రారంభం నాటికి టెండర్లు పూర్తి కావాలి. అప్పటినుంచి ఏడాది పాటు టెండర్‌ పొందిన వ్యక్తులు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, చికెన్‌ తదితర వస్తు సామగ్రిని అందజేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది ఈ టెండర్‌ ప్రక్రియ ఒక ప్రవాసంగా మారింది. జూన్‌లో పూర్తి కావాల్సిన ఈ టెండర్ల ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదు. అధికార పార్టీకి చెందిన ఒక ప్రధాన నాయకురాలి బినామీలకు టెండర్లు దక్కించుకునే ప్రయత్నంలో భాగంగా ఈ జాప్యం జరుగుతోందని టెండరుదారులు ఆరోపిస్తున్నారు.

జిల్లాలో గురుకుల విద్యాలయాలు

శ్రీకాకుళం జిల్లాలో డాక్డర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సాంఘిక సంక్షేమ విద్యాలయాలు 9 ఉన్నాయి. దుప్పలవలస, ఎచ్చెర్ల, పెద్దపాడు, కొల్లివలస, తామరాపల్లి, పాతపత్నం, నందిగాం, మందస, కంచిలిలో ఇవి ఉన్నాయి. సుమారుగా ఒక్కో గురుకులంలో 3 వందల నుంచి 5 వందలు వరకు విద్యార్థులు ఉన్నారు. కొన్ని గురుకులాల్లో ఇంటర్మీడియట్‌ కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. ఈ గురుకులాల్లో ఏడాది పాటు కూరగాయలు ఇతర సరుకులు అందించేందుకు టెండర్లు పిలిచారు.

రాజకీయ జోక్యంతో...

జిల్లాలోని గురుకులాల్లో ఈ ఏడాది జూన్‌ 18వ తేదీన టెండర్లు పిలిచారు. ఈ టెండరు ప్రక్రియ ఆదే నెల 27తో ముగిసింది. సుమారుగా 140 మంది వరకు టెండరులో డీడీలు కట్టి వేశారు. జూన్‌ 29న జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో టెండర్‌ ఓపెన్‌ చేసి, లాటరీ విధానంలో టెండర్‌ ఖరారు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. లాటరీలు కూడా నిర్వహించారు. అయితే ఈ లాటరీల్లో హేమంత్‌, వేణుగోపాల్‌కు రెండేసి గురుకులాలు, ధనలక్ష్మికి నాలుగు గురుకులాలు వచ్చాయి. ఇక్కడే సమస్య మొదలైయింది. పలాసకు చెందిన కూటమి ప్రధాన నాయకురాలి తాలుకా టెండరుదారు మోహనరావుకి తొమ్మిదిలో ఒక్కటి కూడా రాలేదు. దీంతో అతనికి కనీసం మూడు గురుకులాలు ఇవ్వాలని సంబంధిత నాయకులు పట్టుబట్టడంతో ఈ టెండర్లు తాత్కాలికంగా వాయిదా వేశారు. తర్వాత రద్దు చేశారు. మరలా ఇదే గురుకులాలకు జూన్‌ ఒకటో తేదీన మరోసారి టెండర్లు పిలిచారు. అప్పుడు సుమారుగా 180 మంది వరకు బిడ్‌లు వేశారు. వీరిలో కొటేషన్‌ ఆధారంగా లాటరీ విధానంలో సంప్రదింపులతో టెండరు ఖరారుకి సిద్ధమయ్యారు. ఈ టెండర్లను జూన్‌ 7న నిర్వహించారు. ఈసారి పలాకు చెందిన రాజకీయ నాయకురాలి అనుచరుడు కేవలం ఒక్క రూపాయికే కిలో అరటిపండ్లు ఇచ్చేందుకు గాను టెండరు బిడ్‌లో పేర్కొన్నారు. ఇది అసాధ్యమని, అటువంటి టెండర్‌ బిడ్‌ చెల్లదని అధికారులు తేల్చిచెప్పారు. అయితే ఈసారి కూడా రాజకీయ ఒత్తిడి రావడంతో టెండర్లు ఎవ్వరికీ ఇవ్వకుండా ఇంకా జాప్యం చేస్తున్నారు. దీంతో టెండర్లు వేసిన కూరగాయల వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. టెండర్లు మొత్తం సుమారుగా రూ.90 లక్షలు డిపాజిట్లు రూపంలో ఉండిపోయాయి.

అర్హులకు దక్కుకుండా అడ్డంకులు

వాస్తవంగా టెండర్‌లో తక్కువ కొటేషన్‌ ఉన్నవారు, సంప్రదింపుల ద్వారా వచ్చినవారు, గతంలో చక్కగా సరుకులు గురుకులాలకు అందించినవారిని ఎంపిక చేయాల్సింది. అయితే ఈ గురుకుల సరుకు టెండర్లులో రాజకీయ ప్రమేయం పెరగడంతో పూర్తిగా ఈ విధానం తప్పుదోవపడుతోందని, రాజకీయ అండతో వచ్చినవారు సరుకులు సక్రమంగా ఇవ్వరని టెండరుదారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై టెండరుదారులు పలుమార్లు జాయింట్‌ కలెక్టరుని నేరుగా ఆయన చాంబర్‌లో కలిసి వారి సమస్యలు విన్నవించుకున్నారు. అలాగే పీజీఆర్‌ఎస్‌లో కూడా వారి ఇబ్బందులు పరిష్కరించాలని దరఖాస్తు చేసుకోవడం జరిగింది. రాజకీయలకు అతీతంగా ఈ టెండర్లు అర్హులైన వారికి ఇప్పించాలని కోరుతున్నారు.

డీసీఎంఎస్‌కి ఇవ్వాలని ఒత్తిడి

ఇదిలా ఉండగా ఈ ఏడాది నుంచి ప్రతీ వసతి గృహం, గురుకులాలు అన్నింటా సరుకులు సరఫరా డీసీఎంఎస్‌కి ఇవ్వాలని ఆ సంస్థ నాయకులు టీడీపీ నేతలు, అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఒకప్పుడు డీసీఎంఎస్‌ వారు అందరిలాగానే టెండర్లు వేసి, కూరగాయలు మినహా ఇతర కిరాణా సామాగ్రిని గురుకులాలకు అందించేవారు. అయితే ఈసారి అడ్డగోలుగా వారికే దక్కాలని ఆ నాయకులు పట్టుబట్టడంతో ఈ టెండర్లు నిర్వహించే అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

మూలుగుతున్న పాత బకాయిలు

గతేడాది టెండర్లు ద్వారా ఇప్పటివరకు సరఫరా చేస్తున్న కూరగాయలు, చికెన్‌, ఇతర సామగ్రికి చెల్లించాల్సిన మొత్తం ఈ ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించలేదు. దీంతో ఈ వ్యాపారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది బిల్లులతో పాటు, ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి బిల్లులు చెల్లించాల్సి ఉంది. అయితే వారికి సక్రమంగా బిల్లులు మంజూరవ్వక ఇబ్బందులు పడుతున్నారు.

మూడు నెలలుగా ఖరారవ్వని

గురుకులాల టెండర్లు

అక్రమార్కులకు కట్టబెట్టేందుకు యత్నం

అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు

ఎటూ తేల్చుకోలేక సతమతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement