● ఆగివున్న ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ
● ట్రాక్టర్ మరమ్మతులు చేస్తున్న
డ్రైవర్ మృతి
టెక్కలి రూరల్/నరసన్నపేట: తన వాహనం మరమ్మతులకు గురవ్వడంతో రహదారి పక్కన ఆపి వాహనాన్ని మరమ్మతులు చేస్తుండగా.. అనుకోకుండా ఓ కంటైనర్ లారీ ఆ వాహనాన్ని ఢీకొనడంతో చోటుచేసుకున్న ప్రమాదంలో వాహనం మరమ్మతులు చేస్తున్న వ్యక్తి మృతి చెందిన ఘటన కోటబొమ్మాళి మండలం జర్జంగి గ్రామ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. నరసన్నపేట మండలం బుచ్చిపేట గ్రామానికి చెందిన కొన్న నవీన్(35) అనే వ్యక్తి తన ట్రాక్టర్‌తో ఇసుక లోడ్‌కు వెళ్లి మడపం నుంచి టెక్కలి వైపు వస్తున్న సమయంలో కోటబొమ్మాళి మండలం జర్జంగి ఫ్లై ఓవర్ బ్రిడ్జి దిగుతుండగా టైర్ పంక్చర్ అవ్వడంతో రోడ్డు పక్కగా ఆపి మరమ్మతులు చేపట్టాడు. అయితే అదే మార్గంలో వచ్చిన ఒక కంటైనర్ లారీ మరమ్మతులు చేస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొంది. దీంతో ట్రాక్టర్ సమీపంలోని పంట కాలువలో పడిపోగా.. మరమ్మతులు చేస్తున్న డ్రైవర్ ట్రాక్టర్ కిందనే ఉండిపోయాడు. ఇది గుర్తించిన స్థానికులు హుటాహుటిన కోటబొమ్మాళి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నాడు. అనంతరం హైవే సిబ్బంది భారీక్రేన్‌ల సాయంతో ట్రాక్టర్‌ని బయటకు తీయడంతో నవీన్ మృతదేహం బయటపడింది. కాగా ఈ ఘటనతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అనంతరం పోలీసులు ట్రాఫిక్ సరిచేసి మృతదేహాన్ని శవపంచనామ నిమిత్తం కోటబొమ్మాళి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు పొలం పనులు చేసుకుంటూ ట్రాక్టర్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మృతుడికి భార్య అశ్విని, మూడేళ్ల కుమారుడు ధీరజ్‌కుమార్‌లు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోటబొమ్మాళి రూరల్ సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.


