నందిగాం: టెక్కలి నియోజకవర్గంలో నిత్యం గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. తాజాగా నందిగాం మండలం ఆనందపురం పంచాయతీ మాదిగాపురం కొండపై అక్రమ తవ్వకాలు, తరలింపు చేపడుతుండగా.. అడ్డుకున్న రెవెన్యూ సిబ్బందిపై తిరగబడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మాదిగాపురం పరిధి సర్వే నంబర్ 253లో ఉన్న కొండపై అక్రమంగా గ్రావెల్ తవ్వుతున్నట్లు సమాచారం అందుకున్న నందిగాం డిప్యూటీ తహసీల్దార్ రామారావు, స్థానిక వీఆర్వో మధు అక్కడికి చేరుకున్నారు. అక్కడ యంత్రాలతో తవ్వుతున్నవారిని అనుమతులు లేకుండా గ్రావెల్ తవ్వడం, తరలించడం నేరమని, తక్షణం పనులు నిలిపివేయాలని హెచ్చరించారు. అయితే వారు పట్టించుకోకపోవడంతో యంత్రాల తాళాలు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో వారు అధికారులతో వాగ్వాదానికి దిగి తిరగబడ్డారు. ఈ క్రమంలో డీటీ రామారావు చేతికి గాయమైంది. దీంతో డీటీ నందిగాం పోలీసులకు విషయం తెలియజేయడంతో కానిస్టేబుల్ అక్కడికి చేరుకున్నారు. దీంతో తవ్వకందారులు తాళాలు అప్పగించారు. డీటీ వాటిని పోలీసులకు అప్పగించారు. రెవెన్యూ సిబ్బంది తెలిపిన వివరాల మేరకు.. ఈ కొండపై 1980 దశకంలో హరిదాసుపురానికి చెందిన 21 మంది దళితులకు 8 ఎకరాల పట్టాలు అందజేసి ఉన్నారు. ఆ పట్టాలకు 1–బీ, అడంగల్ వంటివి రావడం లేదు. కానీ ఆ 8 ఎకరాలు ఆ దళిత కుటుంబాల ఆధీనంలోనే ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేపట్టడంతో అడ్డుకున్నామన్నారు. కాగా అక్రమంగా కొండను తవ్వేసి, గ్రావెల్ తరలిస్తూ కూడా.. అధికారులపై తిరగబడ్డారంటే వారి వెనుక అధికార పార్టీ నాయకులు ఉంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు.


