టెక్కలి: సాంకేతిక అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, క్యాంపస్ నుంచి నేరుగా కార్పొరేట్ స్థాయికి ఎదిగేవిధంగా చక్కనైనా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని టీసీఎస్ సంస్థ ప్రెసిడెంట్ వి.రాజన్న ఆకాంక్షించారు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన రజతోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం నిర్వహించిన ‘క్యాంపస్ టు కార్పొరేట్’ అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుతున్న సాంకేతిక ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు తమ సాంకేతిక నైపుణ్యాలను మరింత మెరుగుపర్చుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం కేవలం ఉద్యోగాల కోసం కాకుండా, సమాజానికి ఉపయోగపడే విధంగా ఆలోచన చేయాలన్నారు. పాఠ్యంశాలతో పాటు పరిశ్రమలకు అవసరమైన అన్ని రకాల నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. ఏఐ, ఐవోటీ వంటి సాంకేతికత భవిష్యత్‌లో కీలకంగా మారనున్నాయని పేర్కొన్నారు. అనంతరం కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ కె.సోమేశ్వరరావు, కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, కోశాధికారి టి.నాగరాజు, డైరక్టర్ వి.వి.నాగేశ్వర్రావు, ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, ప్లేస్‌మెంట్ డీన్ ఎం.సంతోష్‌కుమార్, కన్వీనర్ బి.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


