శ్రీకాకుళం క్రైమ్: తాతల వారసత్వంగా వచ్చిన తమ ఇనాం భూమిలోని కొంత స్థలాన్ని ఫోర్జరీ పత్రాలతో రావాడ అరుణకుమారి ఆక్రమణ చేస్తున్నారని, అడ్డుకుంటే దాడులకు ఎగబడుతున్నారని కొత్తూరు మండలం కలిగాంకు చెందిన అలికాన శ్రీనివాసరావు ఎస్పీ గ్రీవెన్సులో సోమవారం ఫిర్యాదు చేశారు. కలిగాం బౌండరీలో దాదాపు 70 సెంట్ల స్థలాన్ని ఎం.రాజారావు, అలికాన తులసీదాసుల సహకారంతో అరుణకుమారి ఆక్రమించారని, ఇదే విషయాన్ని సీఎం గ్రీవెన్సులో గత నెల 30న ఫిర్యాదు చేశామని, పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్సులో బాధితుల నుంచి 63 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి బాధితుల వద్ద నుంచి వినతులు స్వీకరించి సకాలంలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.


