జ్వరాల పంజా | - | Sakshi
Sakshi News home page

జ్వరాల పంజా

Aug 31 2026 1:32 AM | Updated on Aug 31 2026 1:32 AM

పల్లెల్లో .. జ్వరాల పంజా ● రోజురోజుకూ విస్తరిస్తున్న జ్వరాలు ● గ్రామాల్లో క్షీణించిన పారిశుద్ధ్యం ● ఆర్‌ఎంపీ వైద్యులే దిక్కు

పల్లెల్లో ..
● రోజురోజుకూ విస్తరిస్తున్న జ్వరాలు ● గ్రామాల్లో క్షీణించిన పారిశుద్ధ్యం ● ఆర్‌ఎంపీ వైద్యులే దిక్కు

సారవకోట: ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామాల్లో వైరల్‌ జ్వరాలు విస్తరిస్తున్నాయి. పారిశుద్ధ్యం క్షీణించడం, సకాలంలో పనులు చేపట్టకపోవడం వంటి కారణాలతో జ్వరాల బారిన పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో సచివాలయం స్థాయిలో పూర్తిస్థాయిలో వైద్య సేవలందించేందుకు ఎంఎల్‌ఏహెచ్‌పీ, ఏఎన్‌ఎంలను నియమించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పట్టించుకునేవారు లేకపోవడంతో గ్రామస్థాయిలో వైద్య సేవలు గగనంగా మారాయి. దీంతో ప్రజలు అందుబాటులో ఉన్న ఆర్‌ఎంపీ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. ఎంఎల్‌హెచ్‌పీలు గ్రామాలలో పర్యటించి ప్రస్తుతం వస్తున్న వ్యాధులకు సంబంధించిన సమాచారాన్ని వారి పరిధిలో ఉన్న పీహెచ్‌సీ వైద్యులకు సమాచారం అందజేయాలి. దీర్ఘకాలిక వ్యాధులున్న వారిని గుర్తించి వారు సంబంధిత పీహెచ్‌సీకి గానీ సచివాలయానికి గానీ రాలేని పక్షంలో వారి ఇంటికే వెళ్లి వైద్య సేవలందించాల్సి ఉంది. ఇప్పుడు ఇవేవీ అమలు కావడం లేదు. వివిధ రకాల వ్యాధులతో వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి పీహెచ్‌సీ, సీహెచ్‌సీలలో ఉన్న వైద్యులను సంప్రదించి వారి సూచనలు, సలహాలు మేరకు రోగులకు వైద్య సేవలందించాల్సి ఉన్నా అవేమీ చేయకుండా సచివాలయాలకే పరిమితమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పల్లెల్లో జ్వరాలు విజృంభిస్తుండటంతో సారవకోట, అలుదు, బొంతు, బుడితి తదితర గ్రామాలలో ఆర్‌ఎంపీ వైద్యులను రోగులు ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే అదునుగా కొందరు ఆర్‌ఎంపీలు ఇష్టానుసారంగా దండుకుంటున్నారు.

ఎల్‌ఎన్‌టీ పోస్టు ఖాళీ..

సారవకోట మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టు కొన్ని నెలలుగా ఖాళీగా ఉండటంతో వైద్య పరీక్షల కోసం వచ్చే వారంతా ప్రైవేట్‌ ల్యాబ్‌లకు పరుగులు తీస్తున్నారు. మరికొందరు బొంతు పీహెచ్‌సీకి వెళ్తున్నారు. ఇక్కడున్న ల్యాబ్‌ టెక్నీషియన్‌ను సంతబొమ్మాళి పీహెచ్‌సీకి డిప్యూటేషన్‌పై పంపించడంతో ఇక్కడ ఖాళీ ఏర్పడింది. అదీకాక సారవకోట సచివాలయం ఏఎన్‌ఎం గతంలో జరిగిన సచివాలయ ఉద్యోగుల బదిలీల నుంచి ఖాళీగా ఉండటంతో గ్రామంలో జ్వరాలపై పర్యవేక్షణ కొరవడుతోంది.

కొరవడిన పారిశుద్ధ్యం..

గ్రామాల్లో పారిశుద్ధ్యం క్షీణిస్తోంది. దీంతో వ్యాధులను వ్యాపింపజేసే దోమలు, ఈగలు ప్రబలి వైరల్‌ జ్వరాలు, టైఫాయిడ్‌ వంటి వ్యాధులకు కారణమవుతున్నాయి. కాలువల్లో పూడికలు తొలగించకపోవడంతో మురుగునీరు రోడ్లపై నిల్వ ఉండిపోతోంది. కొన్ని పంచాయతీలలో నిధులున్నప్పటికీ అక్కడున్న టీడీపీ నాయకులు అడ్డుపడుతున్నారు. ఫలితంగా పనుల నిర్వహణకు పంచాయతీ కార్యదర్శులు ముందుకు రావడం లేదు.

అక్కరకు రాని ఫాగింగ్‌ యంత్రాలు:

గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో దోమల నివారణకు ప్రతీ సచివాలయానికి ఫాగింగ్‌ యంత్రాలు మంజూరు చేశారు. ఆ యంత్రాల వినియోగం లేకపోవడంతో ప్రస్తుతం మూలకు చేరాయి. కొన్ని సచివాలయాలలో ప్యాకింగ్‌లు సైతం తీయకుండా ఉండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement