పనులు మావి.. సెల్ఫీలు మీవి | - | Sakshi
Sakshi News home page

పనులు మావి.. సెల్ఫీలు మీవి

Aug 31 2026 1:32 AM | Updated on Aug 31 2026 1:32 AM

● మా హయాంలో జరిగిన అభివృద్ధిని మీ ఖాతాలో వేసుకుంటున్నారు ● ప్రభుత్వంపై మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు మండిపాటు

● మా హయాంలో జరిగిన అభివృద్ధిని మీ ఖాతాలో వేసుకుంటున్నారు ● ప్రభుత్వంపై మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు మండిపాటు

కాశీబుగ్గ: వైఎస్‌ జగన్‌ హయాంలో అనూహ్య రీతిలో అభివృద్ధి జరిగిందని, పలాస నియోజకవర్గంలో గత 50 ఏళ్ల కాలంలో చూడని పురోగతి కనిపించిందని మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. ఈ ప్రాంతానికి కిడ్నీ ఆస్పత్రి వచ్చిందని, ప్రభుత్వ కాలేజీలు అవసరమైన చోట వెలిశాయని, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న రహదారి సౌకర్యం కల సాకారమైందని గుర్తు చేశారు. గత రెండేళ్ల కాలంలో పలాసలో ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. మేం గతంలో చేపట్టిన చోటికి వెళ్లడం, సెల్ఫీ దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం మినహా ఒరిగింది శూన్యం అంటూ విరుచుకుపడ్డారు. పలాసలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనతో పాటు తన కుమారుడి అరెస్టు సందర్భంలో మీడియా అండగా నిలిచిందని కృతజ్ఞతలు తెలిపారు. పలాస నియోజకవర్గంలో ప్రస్తుతం మీడియాకు స్వేచ్ఛ కరువైందని, ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజానీకానికి స్వతంత్రం ఎక్కడ లభిస్తుందని అన్నారు. పలాసలో వ్యాపారులు సైతం బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారని అన్నారు. ఇళ్లస్థలాల విషయంలో ఈ ప్రభుత్వ హయాంలో న్యాయం జరగని పక్షంలో 2029 లో ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని సీదిరి హామీ ఇచ్చారు.

రెండేళ్లయింది.. ఏం చేశారో చెప్పండి?

కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లయిన కాలంలో పలాస నియోజకవర్గంలో అభివృద్ధి పని ఒక్కటైనా చేపట్టారా? గతంలో మేం చేపట్టిన పనుల దగ్గరికి వెళ్లడం, ఫొటోలు దిగడం తప్ప ఏం చేశారంటూ ఎమ్మెల్యే శిరీషను మాజీ మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ మాజీ ఎమ్మెల్యే హనుమంతు అప్పయ్యదొర చొరవ, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కృషి, వీటిని మరిచిపోయి ఎమ్మెల్యే అక్కడికి వెళ్లి ఫొటోలు దిగడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హయాంలో పలాస–కాశీబుగ్గ జంటపట్టణాల రూపురేఖలు మార్చామని తెలిపారు. మేం చేసింది కొండంత.. చెప్పుకున్నది గోరంత అని తెలిపారు. ఒక్కో మద్యం బాటిల్‌పై వెన్నుపోటు నాయకులు రూ.10మేర చిల్లర ఏరుకుంటున్నారని, ఇదేంటని ప్రశ్నిస్తే వాళ్లపై కేసులు పెడుతున్నారని సీదిరి తెలిపారు. ప్రజలు తమ సొంత కార్యకలాపాల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు, పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లే సందర్భంలో అక్కడి అధికారులు సమస్య ఏంటని అడగటం లేదని, వచ్చినవారిని ఏ పార్టీ అని అడుగుతున్నారని సీదిరి అన్నారు. అదే వైఎస్సార్‌సీపీ హయాంలో అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పినట్లుగా పార్టీ, కులం,మతం చూడకుండా ప్రజలకు మేలు చేసిన మాట వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement