● ఆన్‌లైన్ టికెట్లలో సాంకేతిక లోపంతో ఇక్కట్లు
అరసవల్లి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి కనిపించింది. శ్రావణ మాసం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆదిత్యునికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత ప్రసాదాలు, మంచినీటి సౌకర్యాలను కల్పించారు. రూ.300 చెల్లించిన భక్తులకు అంతరాలయంలో గోత్రనామాలతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో భక్తులకు ఆదివారం ఉదయం 5.30 గంటల నుంచి సర్వదర్శనాలను కల్పించారు. ఆరోగ్యం కోసం రూ.300 చెల్లించి సూర్యనమస్కారాల పూజలు చేయించుకున్నారు.
ఈఓకు ఫిర్యాదులు..
ప్రసాదాల పంపిణీ వద్ద ఆన్‌లైన్ సమస్య తలెత్తడంతో కొందరికి విక్రయాలు సాధ్యం కాలేదు. కేశఖండన శాలలో ఎప్పట్లాగే అక్రమ వసూళ్లు వ్యవహారం తలెత్తింది. టికెట్ల సొమ్ము కంటే అదనంగా డబ్బులు అడుగుతున్నారంటూ కొందరు భక్తులు ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. భక్తుల పట్ల గౌరవంగా ప్రవర్తించకుండా రెగ్యులర్ ఉద్యోగులు సైతం నోరుపారేసుకుంటూ అవమాన పరుస్తున్నారంటూ ఓ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఈవోకు ఫిర్యాదు చేశారు.
ఆన్‌లైన్ అవస్థలు..!
దేవదాయశాఖ ఆన్‌లైన్ విధానంలో ఇటీవల మార్పులు చేపడుతున్న క్రమంలో అరసవల్లి ఆలయంలో ఆన్‌లైన్ విధానంలో సమస్యలు తలెత్తాయి. వివిధ దర్శనాల టికెట్లతో పాటు ఇతరత్రా సౌకర్యాల కల్పనకు ఆలయ ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారానే భభక్తులకు సేవలందిస్తున్నారు. అయితే టెంపుల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (టీఎంఎస్) ఆన్‌లైన్ పోర్టల్‌లో మార్పులు కారణంగా స్థానికంగా ఆలయంలో ఆన్‌లైన్ పనులన్నీ నిలిచిపోయాయి. దీంతో విరాళాల రశీదులు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఆన్‌లైన్ టిక్కెట్లు ఆగిపోవడంతో మాన్యువల్‌గా ఇచ్చిన టికెట్లు, టైం స్లాట్ ఆలస్యమైన టికెట్లతో దర్శనాలకు వెళ్లిన వారు కూడా సిబ్బంది చేష్టలతో ఇబ్బందులు పడ్డారు. దీనిపై ఈఓ స్పందిస్తూ సాంకేతిక లోపంతో ఆలస్యమయ్యాయని, నకిలీ టికెట్లు కావంటూ ధ్రువీరించారు. ఆన్‌లైన్ సమస్యలపై ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.


