శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని మహిళా కాలేజీ సమీపంలో కుమ్మరి వీధిలో ఆక్రమణల తొలగింపునకు ఒకటో పట్టణ పోలీసుల సమక్షంలో మున్సిపాలిటీ అధికారులు ఆదివారం ఉదయం యత్నించారు. చగళ్ల రమణ, మడ్డు గోవిందలకు చెందిన నివాసగృహాల మెట్లను జేసీబీ యంత్రం సాయంతో తొలగించగా ఒకేసారి స్థానికులు మూకుమ్మడిగా వచ్చి అడ్డుకున్నారు. ఇద్దరి కానిస్టేబుళ్ల మధ్య వ్యక్తిగత వైరానికి వీధి మొత్తం బలవ్వాలా? అంటూ స్థానికులు అడ్డుకోవడంతో అధికారులు యంత్రాలతో సహా వెనుదిరగాల్సివస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. కుమ్మరి వీధిలో ఎదురెదురు నివసిస్తున్న సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పొట్టూరు హరిప్రసాద్, లావేరు పీఎస్‌లో కానిస్టేబుల్‌గా ఉన్న ఎ.భారతి భర్త మాధవరావులు మూడు నెలలుగా పార్కింగ్ విషయంలో గొడవ పడుతున్నారు. పార్కింగ్ స్థలం ప్రభుత్వానిదే కావడం, రెండిళ్లకు హక్కేనంటూ గొడవపడ్డారు. ఇదే విషయమై ఎస్పీ గ్రీవెన్సులో సైతం సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడం, ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఇరువైపులా బైండోవర్ కేసులు నమోదు చేశారు. మున్సిపల్ కార్యాలయంలో సైతం ఫిర్యాదులుండటంతో అధికారుల ఆదేశాలతో ఆదివారం జేసీబీ యంత్రాలతో వీధి మొత్తం ఆక్రమణల తొలగింపునకు రావడంతో స్థానికులు తిరగబడటంతో పాటు ఉన్నతాధికారులకు విన్నవించుకోగా మున్సిపాలిటీ సిబ్బంది, పోలీసులు వెనుదిరిగారు.


