హిరమండలం: కుమారుడికి వివాహం జరిపించాలని ఆ తల్లిదండ్రులు భావించారు. ఇంతలోనే కాలువ రూపంలో మృత్యువు కబళించడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హిరమండలంలోని చిన్నకోరాడ వీధికి చెందిన కొంకి గోవింద (37) ఆదివారం ఉదయం పొలం పనులకు వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి స్నానం కోసం చిన్నకోరాడ సమీపంలోని వంశధార కుడి కాలువలో దిగాడు. కొద్దిసేపటికే గల్లంతయ్యాడు. అక్కడే స్నానం చేస్తున్న స్థానికులు గమనించి గ్రామంలోకి వెళ్లి సమాచారం అందించారు. వారంతా వచ్చి కాలువలో గాలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కొత్తూరు అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. సాయంత్రానికి మృతదేహాన్ని బయటకు తీశారు. కుమారుడు విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు అప్పలనరసమ్మ, దుర్గా రావు గుండెలవిసేలా రోదించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మధుసూదనరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ఆస్పత్రికి తరలించారు.


